యెహోషువ 10:28-39
28
ఆ రోజు యెహోషువ మక్కేదాను స్వాధీనపరచుకున్నాడు. అతడు ఆ పట్టణాన్ని దాని రాజును కత్తితో చంపి, దానిలోని వారందరినీ పూర్తిగా నాశనం చేశాడు. ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లుగా మక్కేదా రాజుకు చేశాడు.
29
అప్పుడు యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మక్కేదా నుండి లిబ్నాకు వెళ్లి దానిపై దాడి చేశారు.
30
యెహోవా ఆ పట్టణాన్ని దాని రాజును ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. యెహోషువ ఆ పట్టణాన్ని, దానిలోని వారందరినీ కత్తితో చంపాడు. అక్కడ అతడు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజుకు చేశాడు.
31
అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లిబ్నా నుండి లాకీషుకు వెళ్లి అక్కడ తన దళాలను మోహరించి దాని మీద దాడి చేశాడు.
32
యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు. రెండవ రోజు యెహోషువ దానిని పట్టుకుని లిబ్నాకు చేసినట్లే ఆ పట్టణాన్ని, అందులోని వారందరినీ ఖడ్గంతో చంపాడు.
33
ఇంతలో గెజెరు రాజైన హోరాము లాకీషుకు సహాయం చేయడానికి రాగా అయితే యెహోషువ ఎవరూ ప్రాణాలతో మిగులకుండా అతన్ని అతని సైన్యాన్ని హతం చేశాడు.
34
అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లాకీషు నుండి ఎగ్లోనుకు వెళ్లారు; దానికి వ్యతిరేకంగా వారు తమ సైన్యాన్ని మోహరింపజేసి దాని మీద దాడి చేశాడు.
35
వారు లాకీషుకు చేసినట్లుగా అదే రోజు దానిని పట్టుకుని ఖడ్గంతో అక్కడ ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు.
36
ఎగ్లోను నుండి యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు హెబ్రోనుకు వెళ్లి దాని మీద దాడి చేశారు.
37
వారు దానిని పట్టుకుని దానిని దాని రాజును దానికి చెందిన అన్ని గ్రామాలను దానిలో ఉన్నవారినందరిని ఖడ్గంతో చంపారు. ఎగ్లోనుకు చేసినట్టే దానిని దానిలో ఉన్నవారినందరిని పూర్తిగా నాశనం చేశారు.
38
తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు వెనుకకు వచ్చి దెబీరు మీద దాడి చేశాడు.
39
వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దాని గ్రామాలను పట్టుకుని కత్తితో చంపారు. అందులో ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు. వారు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. లిబ్నాకు, దాని రాజుకు, హెబ్రోనుకు చేసినట్లే వారు దెబీరుకు, దాని రాజుకు చేశారు.
Settings