Skip to content
యోనా 1:5-17

యోనా 1:5-17

5
ఆ నావికులందరు భయపడ్డారు, ప్రతివాడు తన దేవునికి మొరపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అయితే యోనా ఓడ దిగువ భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రలోకి వెళ్లాడు.
6
ఓడ నాయకుడు అతని దగ్గరకు వెళ్లి, “నీవు ఎలా పడుకోగలుగుతున్నావు? లేచి నీ దేవునికి మొరపెట్టు! ఒకవేళ ఆయన మనల్ని గమనించి మనం నశించకుండా చేస్తారేమో” అని అన్నాడు.
7
అప్పుడు నావికులు, “రండి, ఎవరి మూలంగా ఈ ఆపద రాడానికి ఎవరు బాధ్యులో చీట్లు వేసి తెలుసుకుందాం” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేరిట వచ్చింది.
8
కాబట్టి వారు అతన్ని, “చెప్పు, ఈ కష్టం మన మీదికి రావడానికి ఎవరు బాధ్యులు? నీవు ఏ పని చేస్తావు? నీవు ఎక్కడ నుండి వచ్చావు? నీ దేశం ఏది? నీ జనమేది?” అని అడిగారు.
9
అందుకతడు, “నేను హెబ్రీయున్ని; సముద్రాన్ని ఎండిన నేలను సృజించిన పరలోక దేవుడైన యెహోవాను ఆరాధిస్తాను” అన్నాడు.
10
దానికి వారు భయపడి అతనితో, “నీవు చేసింది ఏంటి?” అన్నారు. (అతడు యెహోవా నుండి పారిపోతున్నాడని వారికి తెలుసు, ఎందుకంటే అతడు అప్పటికే వారికి చెప్పాడు.)
11
సముద్రంలో తుఫాను మరీ తీవ్రంగా మారుతుంది. కాబట్టి వారు అతన్ని, “సముద్రం మాకోసం నిమ్మళించాలంటే మేము నీకేం చేయాలి?” అని అడిగారు.
12
అందుకు అతడు, “నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం నిమ్మళిస్తుంది. ఈ గొప్ప తుఫాను నా కారణంగానే మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు” అన్నాడు.
13
అయితే వారు ఓడను సముద్రతీరానికి చేర్చడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కాని తుఫాను ఇంకా తీవ్రంగా విజృంభిస్తుంది కాబట్టి వారు ఏమి చేయలేకపోయారు.
14
అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి, “యెహోవా, ఈ మనిషి ప్రాణం కోసం దయచేసి మమ్మల్ని చావనివ్వకండి. నిర్దోషిని చంపుతున్నామని మామీద నేరం మోపకండి, ఎందుకంటే యెహోవా, మీ ఇష్ట ప్రకారం ఇలా జరిగిస్తున్నారు” అని చెప్పి,
15
వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు, వెంటనే పొంగుతూ ఉన్న సముద్రం నిమ్మళించింది.
16
అది చూసి వారంతా యెహోవాకు ఎంతో భయపడి, యెహోవాకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేశారు.
17
యెహోవా యోనాను మ్రింగడానికి పెద్ద చేపను యెహోవా నియమించారు, యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options