యిర్మీయా 38:1-6
1
మత్తాను కుమారుడైన షెఫట్యా, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకాలు, మల్కీయా కుమారుడైన పషూరు యిర్మీయా ప్రజలందరితో చెప్పేది విని,
2
“యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణంలో నివసించేవారు ఖడ్గంతో కరువుతో తెగులుతో చనిపోతారు, కానీ బబులోనీయుల దగ్గరకు వెళ్లేవారు బ్రతుకుతారు. వారు తమ ప్రాణాలతో తప్పించుకుని బ్రతుకుతారు; వారు జీవిస్తారు.’
3
యెహోవా ఇలా అంటున్నారు: ‘ఈ పట్టణం ఖచ్చితంగా బబులోను రాజు సైన్యానికి అప్పగించబడుతుంది, అతడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు’ ” అని చెప్పడం విన్నారు.
4
అప్పుడు ఆ అధికారులు రాజుతో, “ఈ వ్యక్తికి మరణశిక్ష విధించాలి. ఇతడు ఈ పట్టణంలో మిగిలి ఉన్న సైనికులను, అలాగే ప్రజలందరినీ తాను వారితో చెప్పే మాటల ద్వార నిరుత్సాహపరుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ ప్రజల క్షేమం కోరడంలేదు, వారి పతనాన్ని కోరుతున్నాడు.”
5
అందుకు రాజైన సిద్కియా, “అతడు మీ ఆధీనంలో ఉన్నాడు, రాజు మీకు వ్యతిరేకంగా ఏమి చేయడు” అన్నాడు.
6
కాబట్టి వారు యిర్మీయాను తీసుకెళ్లి, చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజు కుమారుడైన మల్కీయా నీటి గోతిలోకి దింపినప్పుడు దాంట్లో వారు యిర్మీయాను త్రాళ్లతో నీటి గోతిలోకి దించారు; దాంట్లో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో మునిగిపోయాడు.
Settings