యిర్మీయా 30:1-12
1
యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది:
2
“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను మాట్లాడిన మాటలన్నీ ఒక గ్రంథంలో వ్రాయి.
3
అవి జరుగబోయే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలును, యూదాను చెరనుండి విడిపించి, వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి వారిని రప్పిస్తాను, వారు దాన్ని స్వాధీనం చేసుకునే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా చెప్తున్నారు.”
4
ఇశ్రాయేలు, యూదా గురించి యెహోవా చెప్పిన మాటలు:
5
“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘భయంతో కూడిన కేకలు వినబడుతున్నాయి, భయమే ఉంది తప్ప, సమాధానం లేదు.
6
ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి?
7
ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.
8
సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ ‘ఆ రోజు, నేను వారి మెడల మీద ఉన్న కాడిని విరగ్గొడతాను వారి బంధకాలను తెంపివేస్తాను; ఇకపై విదేశీయులు వారిని బానిసలుగా చేయరు.
9
కాని, వారు తమ దేవుడైన యెహోవాకు సేవ చేస్తారు నేను వారికి రాజుగా నియమించే దావీదు రాజును వారు సేవిస్తారు.
10
“ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.
11
నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘నేను నిన్ను చెదరగొట్టిన దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చేయను. కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.’
12
“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది.
Settings