యెషయా 62:1-9
1
సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.
2
దేశాలు నీ నీతిని చూస్తాయి. రాజులందరూ నీ మహిమను చూస్తారు. యెహోవా నీకు ఇవ్వబోయే క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.
3
నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా, నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు.
4
ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు, నీ దేశం పాడైపోయిందని పిలువబడదు. అయితే నీవు హెఫ్సీబా అని నీ దేశం బ్యూలా అని పిలువబడుతుంది; యెహోవా నీలో ఆనందిస్తారు నీ దేశానికి పెళ్ళి అవుతుంది.
5
యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు; పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.
6
యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను; పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు. యెహోవాకు మొరపెట్టే వారలారా విశ్రాంతి తీసుకోకండి,
7
యెరూషలేమును స్థాపించే వరకు భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.
8
యెహోవా తన కుడిచేతితో తన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు: “ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను. నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు;
9
అయితే పంట పండించిన వారే దానిని తిని యెహోవాను స్తుతిస్తారు. ద్రాక్షలను సమకూర్చిన వారే నా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.”
Settings