హబక్కూకు 1:8-17
8
వారి గుర్రాలు చిరుతపులి కంటే వేగవంతమైనవి, చీకట్లలో తిరిగే తోడేళ్ళ కంటే భయంకరమైనవి. వారి గుర్రాల దండు దూకుడుగా చొరబడతాయి; వారి రౌతులు దూరం నుండి వస్తారు. ఎరను పట్టుకోవడానికి గ్రద్ద వచ్చినట్లుగా వారు వేగంగా వస్తారు;
9
వారంతా దౌర్జన్యం చేయడానికి వస్తారు. ఎడారి గాలిలా వారి ముఖాలను పైకెత్తి ఇసుకరేణువులంత విస్తారంగా ప్రజలను బందీలుగా పట్టుకుంటారు.
10
వారు రాజులను వెక్కిరిస్తారు పాలకులను ఎగతాళి చేస్తారు. కోటలున్న పట్టణాలను చూసి నవ్వుతారు; మట్టి దిబ్బలు వేసి వాటిని స్వాధీనపరచుకుంటారు.
11
గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతూ అపరాధులవుతారు, తమ బలాన్నే తమ దేవునిగా భావిస్తారు.”
12
యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు.
13
నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి; నీవు తప్పును సహించలేవు. మరి ద్రోహులను ఎందుకు సహిస్తున్నావు? దుర్మార్గులు తమకంటే నీతిమంతులైన వారిని నాశనం చేస్తుంటే నీవెందుకు మౌనంగా ఉన్నావు?
14
పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు.
15
చెడ్డ శత్రువు వారందరిని గాలంతో పైకి లాగి, తన వలలో వారిని పట్టుకుంటాడు, తన ఉచ్చులో వారిని పోగుచేసుకుని సంతోషంతో గంతులు వేస్తాడు.
16
తన వల వలన విలాసవంతమైన జీవితం మంచి ఆహారం దొరుకుతుందని తన వలకు బలులు అర్పించి తన ఉచ్చుకు ధూపం వేస్తాడు.
17
అతడు కనికరం లేకుండా దేశాలను నాశనం చేస్తూ, నిత్యం తన వలను ఖాళీ చేస్తూనే ఉంటాడా?
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings