Skip to content
ఆదికాండము 44:1-18

ఆదికాండము 44:1-18

1
యోసేపు తన ఇంటి గృహనిర్వాహకుని పిలిచి, “ఈ మనుష్యులు మోసికొని వెళ్లగలిగినంత ఆహారంతో వారి సంచులు నింపి ఎవరి గోనెసంచిలో వారు రూకలుగా తెచ్చిన వెండిని కూడా పెట్టు.
2
తర్వాత కనిష్ఠుని గోనెసంచిలో మాత్రం ధాన్యం, రూకలుగా తెచ్చిన వెండితో పాటు నా వెండి గిన్నెను పెట్టు” అని సూచించాడు. అతడు యోసేపు చెప్పినట్టు చేశాడు.
3
తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు వారి గాడిదలతో పాటు పంపబడ్డారు.
4
పట్టణం నుండి వారింకా దూరం వెళ్లకముందే, యోసేపు గృహనిర్వాహకునితో, “వెంటనే ఆ మనుష్యుల వెంట వెళ్లు, వారిని పట్టుకున్నప్పుడు, ‘మేలుకు ప్రతిగా కీడును ఎందుకు చేశారు?
5
ఇది మా యజమాని త్రాగడానికి, భవిష్యవాణి కోసం ఉపయోగించే గిన్నె కాదా? మీరు చేసింది చెడ్డ పని’ అని వారితో చెప్పు” అన్నాడు.
6
గృహనిర్వాహకుడు వారిని కలిసినప్పుడు, అవే మాటలు చెప్పాడు.
7
అయితే వారు, “మా ప్రభువు ఎందుకు అలా అంటున్నాడు? మీ దాసులకు అలాంటి పని దూరమవును గాక!
8
మా గోనెసంచులలో దొరికిన వెండి తిరిగి కనాను దేశం నుండి తెచ్చాము. కాబట్టి వెండి లేదా బంగారం ఎందుకు నీ యజమాని ఇంటి నుండి దొంగిలిస్తాము?
9
ఒకవేళ మీ దాసులలో ఎవరి దగ్గరైనా దొరికితే, వాడు చస్తాడు; మిగిలినవారం మా ప్రభువా బానిసలమవుతాం” అని అన్నారు.
10
అప్పుడు అతడు, “సరే మీరన్నట్టే కానివ్వండి; ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడు నాకు బానిస అవుతాడు, మిగితా వారు నిర్దోషులవుతారు” అని అన్నాడు.
11
వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు.
12
అప్పుడు గృహనిర్వాహకుడు పెద్దవాడి నుండి ప్రారంభించి చిన్నవాడి వరకు సోదా చేశాడు. ఆ గిన్నె బెన్యామీను గోనెసంచిలో దొరికింది.
13
ఇది చూసి వారు తమ బట్టలు చింపుకున్నారు. వారందరు తమ గాడిదల మీద తన గోనెసంచులు ఎత్తుకుని, తిరిగి పట్టణానికి వెళ్లారు.
14
యూదా అతని సోదరులు వచ్చినప్పుడు యోసేపు ఇంట్లోనే ఉన్నాడు, వారు అతని ఎదుట సాష్టాంగపడ్డారు.
15
యోసేపు వారితో, “మీరు చేసిన ఈ పని ఏంటి? నా లాంటి మనుష్యుని భవిష్యవాణి ద్వారా విషయాలు తెలుసుకుంటాడని మీకు తెలియదా?” అని అన్నాడు.
16
యూదా జవాబిస్తూ, “మా ప్రభువా, మేమేమి చెప్పగలం? మా నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలం? మీ దాసుల అపరాధాన్ని దేవుడు బయటపెట్టారు. మేమిప్పుడు మా ప్రభువు బానిసలం; మాలో ఎవరి సంచిలో గిన్నె దొరుకుతుందో వాడు కూడా మా ప్రభువుకు దాసుడవుతాడు” అన్నాడు.
17
అయితే యోసేపు, “అలా చేయడం నాకు దూరం అవును గాక! ఎవరి దగ్గర గిన్నె దొరికిందో అతడు మాత్రమే నా బానిస. మిగిలిన మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్లండి” అన్నాడు.
18
అప్పుడు యూదా అతని దగ్గరకు వెళ్లి అన్నాడు: “నా ప్రభువా, మీ దాసుని క్షమించి నా ప్రభువుతో ఒక్క మాట మాట్లాడనివ్వండి. మీరు ఫరోతో సమానులైనను మీ దాసునిపై కోప్పడకండి.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options