యెహెజ్కేలు 45:7-17
7
“ ‘ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి ఎదురుగా, వాటికి పడమర వైపుగా తూర్పు వైపుగా, ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి రెండు వైపులా ఉన్న భూభాగాన్ని యువరాజుకు కేటాయించాలి. పడమర నుండి తూర్పుకు కొలిచినప్పుడు అది ఒక గోత్ర భాగానికి సరిపడిన పొడవు ఉండాలి.
8
ఈ భూమి ఇశ్రాయేలులో అతనికి స్వాస్థ్యంగా ఉంటుంది. నా అధిపతులు ఇకపై నా ప్రజలను హింసించరు కానీ ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల ప్రకారం భూమిని కేటాయించుకోడానికి అనుమతిస్తారు.
9
“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
10
మీరు సరైన త్రాసు సరైన ఏఫాను సరైన బాతును వాడండి.
11
ఏఫా బాతు ఒకే పరిమాణంలో ఉండాలి; హోమెరులో పదవ వంతు ఏఫా, హోమెరులో పదవ వంతు బాతు; హోమెరు రెండింటికీ ప్రామాణిక కొలతగా ఉండాలి.
12
ఒక షెకెలుకు ఇరవై గెరాలు. ఇరవై షెకెళ్లు, ఇరవై అయిదు షెకెళ్లు, పదిహేను షెకెళ్లు కలిపి ఒక మినాకు సమానము.
13
“ ‘మీరు అర్పించవలసిన ప్రత్యేక కానుక ఏంటంటే ప్రతి హోమెరు గోధుమలలో ఒక ఏఫాలో ఆరవ భాగం ప్రతి హోమెరు యవలలో ఒక ఏఫాలో ఆరవ భాగం అర్పించాలి.
14
సూచించిన భాగం బాతులలో కొలత ప్రకారం మీ నూనెలో ప్రతి కోరుకు బాతులో పదోవంతు అర్పించాలి. ఒక కోరు అనగా పది బాతులు లేదా ఒక హోమెరు; అంటే పది బాతులు ఒక హోమెరుకు సమానము.
15
అలాగే ఇశ్రాయేలులో మంచి నీరున్న పచ్చికబయళ్లలో మేపిన మందలోని ప్రతి రెండు వందలకు ఒక గొర్రెను తీసుకోవాలి. ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వీటిని భోజనార్పణలు, దహనబలులు, సమాధాన బలులకు ఉపయోగిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
16
దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని యువరాజుకు ఈ ప్రత్యేక కానుక ఇవ్వాలి.
17
పండుగల్లోను, అమావాస్య దినాల్లోను, సబ్బాతు దినాల్లోను, ఇశ్రాయేలీయులు కూడుకునే నియామక కాలాల్లోను వాడబడే దహనబలులను నైవేద్యాలను పానార్పణలను అందించడం అధిపతి యొక్క బాధ్యత. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలులు, భోజనార్పణలు, దహనబలులు, సమాధానబలులను సమకూరుస్తాడు.
Settings