యెహెజ్కేలు 44:1-8
1
అతడు నన్ను తూర్పు వైపున ఉన్న పరిశుద్ధస్థలం బయటి ద్వారం దగ్గరికి తీసుకువచ్చాడు. అది మూసి ఉంది.
2
యెహోవా నాతో ఇలా అన్నారు, “అది మూసే ఉంటుంది. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ద్వారం గుండా ప్రవేశించారు కాబట్టి అది మూసే ఉంటుంది. ఏ ఒక్కరూ దానిలో ప్రవేశించకుండా ఇక ఎన్నటికీ తెరవకుండా మూసే ఉంటుంది.
3
యువరాజైన ఒక్కడే యెహోవా సన్నిధిలో భోజనం చేయడానికి ద్వారం లోపల కూర్చోవచ్చును. అతడు మంటపం మార్గంలో లోపలికి వెళ్లి అదే దారిలో బయటకు వెళ్లాలి.”
4
అతడు నన్ను ఉత్తర ద్వారం గుండా మందిరం ముందుకు తీసుకువచ్చాడు. అప్పుడు నేను యెహోవా మహిమ ప్రకాశంతో యెహోవా మందిరం నిండిపోవడం చూసి నేను నేలపై పడ్డాను.
5
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, యెహోవా ఆలయానికి సంబంధించిన అన్ని నియమాలు విధుల గురించి నేను నీకు చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని గ్రహించు. మందిరం లోపలికి వచ్చే మార్గాన్ని పరిశుద్ధస్థలం నుండి బయటకు వెళ్లే అన్ని మార్గాలను శ్రద్ధగా గమనించు.
6
తిరుగుబాటు చేసే ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు ప్రజలారా, ఇంతవరకు మీరు చేసిన అసహ్యమైన ఆచారాలు చాలు.
7
మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు.
8
మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు.
Settings