యెహెజ్కేలు 36:1-13
1
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచించి ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.
2
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ఆహా! ప్రాచీనమైన ఉన్నత స్థలాలు మా స్వాధీనమయ్యాయి” అని శత్రువులు నీ గురించి అన్నారు.’
3
కాబట్టి ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మిగిలిన ఇతర దేశాల వారికి స్వాధీనమయ్యేలా, ప్రజల మధ్యలో మీరు ఎగతాళిచేయబడి హేళన చెందేలా, వారు అన్ని వైపుల నుండి మిమ్మల్ని ధ్వంసం చేసి అణచివేశారు.
4
కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి: ప్రభువైన యెహోవా పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో, నిర్జనమైన శిథిలాలతో, మీ చుట్టూ ఉన్న మిగిలిన ఇతర జాతులచేత దోచుకోబడి అపహాస్యం చేయబడిన పాడైన పట్టణాలతో మాట్లాడుతూ,
5
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: చుట్టూ ఉన్న దేశాలు, ఎదోము వారంతా ద్వేషంతో, ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నారు, కాబట్టి నేను తీవ్రమైన రోషంలో నేను వారికి వ్యతిరేకంగా మాట్లాడాను.’
6
కాబట్టి ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచించి పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు దేశాల మధ్య అవమానించబడ్డారు, కాబట్టి నేను నా రోషంలో ఉగ్రతలో మాట్లాడుతున్నాను.
7
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీ చుట్టూ ఉన్న దేశాలు కూడా అవమానం పాలవుతాయని నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను.
8
“ ‘కాని ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ ఇంటికి తిరిగి వస్తారు, కాబట్టి మీరు కొమ్మలుగా ఎదిగి వారి కోసం పండ్లు ఇవ్వాలి.
9
నేను మీ పక్షంగా ఉండి మీమీద దయ చూపిస్తాను; మీరు దున్నబడి, విత్తబడతారు.
10
మీమీద మనుష్యజాతిని అంటే ఇశ్రాయేలీయులందరు నివసించేలా చేస్తాను. నా పట్టణాల్లో మళ్ళీ నివాసులు ఉంటారు, శిథిలాలు మళ్ళీ కట్టబడతాయి.
11
మీమీద నివసించే మనుష్యులను పశువులను నేను విస్తరింపజేస్తాను, వారు ఫలించి విస్తరిస్తారు. గతంలో ఉన్నట్లే మీమీద ప్రజలను స్థిరపరచి, అంతకుముందు కన్నా అధికంగా అభివృద్ధి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
12
నేను మనుష్యజాతిని అనగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను మీమీద నివసించేలా చేస్తాను. వారు మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటారు, మీరు వారికి స్వాస్థ్యంగా ఉంటారు; ఇక ఎప్పటికీ మీరు వారిని పిల్లలు లేనివారిగా చేయరు.
13
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీవు మనుష్యులను చంపుతూ, నీ దేశంలో పిల్లలు లేకుండా చేస్తున్నావు” అని కొందరు నీ గురించి చెప్పుకుంటున్నారు.
Settings