యెహెజ్కేలు 21:18-27
18
యెహోవా వాక్కు నాకు వచ్చి:
19
“మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు.
20
అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
21
దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు.
22
యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు.
23
అతనితో ఒప్పందం చేసుకున్న వారికి ఇది తప్పుడు శకునంగా కనిపిస్తుంది, కాని అతడు వారి అపరాధాన్ని వారికి గుర్తు చేసి వారిని బందీగా తీసుకెళ్తాడు.
24
“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు.
25
“ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది,
26
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు.
27
శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’
Settings