యెహెజ్కేలు 21:13-22
13
“ ‘పరీక్ష తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఖడ్గం తృణీకరించిన రాజదండం కూడా కొనసాగకపోతే ఎలా? అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’
14
“కాబట్టి మనుష్యకుమారుడా, ప్రవచించు, నీ రెండు చేతులతో చప్పట్లు కొట్టు. ఖడ్గం రెండు సార్లు దాడి చేయును గాక మూడుసార్లు అయినా దాడి చేయును గాక. అది వధ కొరకైన ఖడ్గం, మహా వధ కొరకైన ఖడ్గం, అన్ని వైపుల నుండి వారి మీద దాడి చేస్తుంది.
15
తద్వార వారి హృదయాలు భయంతో కరిగిపోవును గాక, చాలామంది హతమవుదురు గాక, వారి గుమ్మాలన్నిటి దగ్గర నేను ఖడ్గాన్ని నిలబెట్టాను. చూడండి! అది తళతళ మెరుస్తూ ఉంది, అది వధ కోసం దూయబడింది.
16
ఖడ్గమా! కుడివైపు వేటు వేయి, తర్వాత ఎడమవైపు వేటు వేయి. ఎటువైపు త్రిప్పబడితే అటు వేటు వేయి.
17
నేను కూడా నా చేతులతో చప్పట్లు కొట్టి, నా ఉగ్రత తీర్చుకుంటాను. యెహోవానైన నేనే ఈ మాట అన్నాను.”
18
యెహోవా వాక్కు నాకు వచ్చి:
19
“మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు.
20
అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
21
దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు.
22
యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు.
Settings