Skip to content
నిర్గమకాండము 34:11-26

నిర్గమకాండము 34:11-26

11
నేడు నేను మీకు ఆజ్ఞాపించే దానికి లోబడాలి. నేను అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్లగొడతాను.
12
మీరు వెళ్లబోతున్న దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి, లేకపోతే వారు మీ మధ్య ఉరిగా ఉంటారు.
13
మీరు వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి.
14
మీరు ఇతర దేవుళ్ళను ఆరాధించకూడదు, ఎందుకంటే రోషం గలవాడని పేరుగల యెహోవా, రోషం గల దేవుడు.
15
“ఆ దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి; ఎందుకంటే వారు తమ దేవుళ్ళతో వ్యభిచరించి వాటికి బలులు అర్పించినప్పుడు, వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీరు ఆ బలులను తింటారు.
16
మీరు మీ కుమారులకు వారి కుమార్తెలను భార్యలుగా చేసుకున్నప్పుడు ఆ కుమార్తెలు తమ దేవుళ్ళతో వ్యభిచరించి మీ కుమారులచేత అదే విధంగా చేయిస్తారు.
17
“ఏ దేవుళ్ళ విగ్రహాలు చేసుకోకూడదు.
18
“పులియని రొట్టెల పండుగ జరుపుకోవాలి. ఎందుకంటే నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఏడు రోజులు మీరు పులియని పిండితో చేసిన రొట్టెలే తినాలి. అబీబు నెలలో నిర్ణీత సమయంలో మీరిలా చేయాలి, ఎందుకంటే ఆ నెలలో మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చారు.
19
“ప్రతి గర్భం యొక్క మొదటి సంతానం నాదే, మీ పశువుల్లో మొదటి సంతానమైన ప్రతి మగపిల్ల అది దూడ గాని, గొర్రెపిల్ల గాని, అది నాకు చెందుతుంది.
20
గొర్రెపిల్లను ఇచ్చి మొదటి సంతానమైన గాడిదను విడిపించుకోవాలి, అలా మీరు దాన్ని విడిపించుకోకపోతే, దాని మెడ విరగ్గొట్టాలి. మీ ప్రతి మొదటి మగపిల్లవాన్ని విడిపించుకోవాలి. “నా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
21
“ఆరు రోజులు మీరు పని చేయాలి, కాని ఏడవ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాలి; అది దున్నే కాలమైనా పంట కోసే కాలమైనా సరే మీరు విశ్రాంతి తీసుకోవాలి.
22
“గోధుమపంటలోని ప్రథమ ఫలాలతో వారాల పండుగ ఆచరించాలి, సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ ఆచరించాలి.
23
సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు ఇశ్రాయేలీయుల దేవుడు ప్రభువైన యెహోవా సన్నిధిలో కనబడాలి.
24
నేను మీ ఎదుట నుండి దేశాలను తరిమివేసి, మీ భూభాగాన్ని విస్తరింపజేస్తాను, మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో కనబడడానికి మీరు సంవత్సరానికి మూడుసార్లు పైకి వెళ్లినప్పుడు మీ భూమిని ఎవరూ ఆశించరు.
25
“పులిసిన దానితో కలిపి నాకు బలి యొక్క రక్తాన్ని అర్పించకూడదు, పస్కా పండుగ నుండి ఏ బలికి చెందినది ఏదీ ఉదయం వరకు మిగలకూడదు.
26
“మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. “మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options