దానియేలు 8:3-14
3
నేను కళ్ళెత్తి చూడగా ఆ కాలువ ప్రక్కన రెండు కొమ్ములున్న ఒక పొట్టేలు ఉంది, ఆ కొమ్ములు పొడువుగా ఉన్నాయి. ఆ కొమ్ములలో ఒకటి రెండవ దానికంటే పొడువుగా ఉంది కాని అది తర్వాత మొలిచింది.
4
నేను చూస్తుండగా ఆ పొట్టేలు పడమర, ఉత్తర, దక్షిణాల వైపు కొమ్ములతో పొడుస్తూ ఉంది. దాని ఎదుట ఏ జంతువు నిలబడలేక పోయింది, దాని శక్తి నుండి ఏది తప్పించుకోలేదు. అది తన ఇష్టానుసారంగా చేస్తూ గొప్పగా అయ్యింది.
5
నేను దాని గురించి ఆలోచిస్తుండగా, అకస్మాత్తుగా పడమటి నుండి కళ్ల మధ్యలో పెద్ద కొమ్ము ఉన్న ఒక మేకపోతు వచ్చి, కాళ్లు నేలను తాకించకుండా భూమంతా పరుగు పెట్టింది.
6
ఆ మేకపోతు కాలువ ఒడ్డున నేను చూసిన రెండు కొమ్ముల పొట్టేలు వైపు వచ్చి తీవ్రమైన కోపంతో బలంగా దానివైపు పరుగెత్తింది.
7
అది పొట్టేలుపై ఆవేశంగా దాడి చేసి, దాని రెండు కొమ్ములను విరగ్గొట్టింది. దాని ఎదుట పొట్టేలు నిలువలేకపోయింది; మేకపోతు దాన్ని క్రింద పడేసి త్రొక్కేసింది, దాని శక్తి నుండి పొట్టేలును ఎవరూ రక్షించలేకపోయారు.
8
మేకపోతు ఎంతో గొప్పగా అయ్యింది, కాని దాని అధికారం ఉన్నత స్థితిలో ఉండగా, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది, దాని స్థానంలో నాలుగు పెద్ద కొమ్ములు పైకి వచ్చి ఆకాశం నాలుగు వైపులకు పెరిగాయి.
9
వాటిలో ఒకదాని నుండి మరో కొమ్ము వచ్చింది, అది చిన్నగా ప్రారంభమై దక్షిణం, తూర్పుకు, సుందరమైన దేశం వైపు బలంతో వ్యాపించింది.
10
అది ఆకాశ సమూహాన్ని చేరేవరకు పెరిగి కొన్ని నక్షత్ర సమూహాలను భూమిపై పడేసి, వాటిని త్రొక్కింది.
11
యెహోవా సైన్యం యొక్క అధిపతికి సమానంగా తనను తాను హెచ్చించుకుంది; యెహోవా నుండి అనుదిన అర్పణలను నిలిపివేసింది, ఆయన పరిశుద్ధాలయాన్ని పడద్రోసింది.
12
దాని తిరుగుబాటును బట్టి, యెహోవా ప్రజలు, అనుదిన అర్పణలు దానికి ఇవ్వబడ్డాయి. అది సత్యాన్ని నేలపాలు చేసి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వర్థిల్లింది.
13
అప్పుడు ఒక పరిశుద్ధుడు మాట్లాడడం నేను చూశాను, మరో పరిశుద్ధుడు అతనితో, “అనుదిన అర్పణలు, నాశనానికి కారణమైన తిరుగుబాటు, పరిశుద్ధాలయాన్ని లోబరచుకోవడం, యెహోవా ప్రజలు పాదాల క్రింద త్రొక్కబడుతున్న ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది?” అన్నాడు.
14
అతడు నాతో, “దానికి 2,300 ఉదయ సాయంత్రాలు పడుతుంది; తర్వాత పరిశుద్ధాలయం తిరిగి పవిత్రపరచబడుతుంది.”
Settings