Skip to content
దానియేలు 7:7-14

దానియేలు 7:7-14

7
“దాని తర్వాత రాత్రివేళ నా దర్శనంలో నేను చూస్తుండగా నాలుగవ మృగం కనిపించింది. అది భయానకంగా, భయం కలిగించేదిగా, మహా శక్తి కలిగి ఉంది. దానికి పెద్ద ఇనుప పళ్లున్నాయి; అది దాని బాధితులను నలిపి మ్రింగివేసి, మిగిలిన దానిని కాళ్లక్రింద త్రొక్కేసింది. అంతకుముందు కనిపించిన మృగాల కంటే అది భిన్నమైనది, దానికి పది కొమ్ములున్నాయి.
8
“నేను కొమ్ముల గురించి ఆలోచిస్తుండగా వాటి మధ్య నుండి మరొక చిన్న కొమ్ము పైకి వచ్చింది. మొదటి మూడు కొమ్ములు దాని ఎదుట నుండి పెరికివేయబడ్డాయి. ఈ కొమ్ముకు మనిషిలాంటి కళ్లు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నాయి.
9
“నేను చూస్తుండగా, “సింహాసనాలు వాటి స్థానాల్లో వేయబడ్డాయి, వాటిపై మహా వృద్ధుడు కూర్చున్నారు. ఆయన వస్త్రం మంచులా తెల్లగా, ఆయన తలవెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రె ఉన్నిలా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిలా మండుతూ ఉంది, దాని చక్రాలు మండుతూ ఉన్నాయి.
10
ఆయన ఎదుట నుండి అగ్ని నది ప్రవహిస్తూ వస్తుంది, వేవేలకొలది ఆయనకు సేవ చేస్తున్నారు; పదివేలకొలది ఆయన ఎదుట నిలబడ్డారు, న్యాయసభ మొదలైంది, గ్రంధాలు విప్పారు.
11
“అప్పుడు నేను చూస్తుండగా ఆ చిన్న కొమ్ము గర్వంగా మాట్లాడినందుకు ఆ జంతువు చంపబడింది. దాని శవం నాశనం చేయబడి మండుతున్న అగ్నిలో పడవేయబడింది.
12
(ఇతర మృగాల తమ అధికారం కోల్పోయాయి, కాని కొంతకాలం వరకు బ్రతకడానికి అనుమతించబడ్డాయి.)
13
“రాత్రి దర్శనంలో నేను చూస్తుండగా మనుష్యకుమారునిలా ఉన్న ఒక వ్యక్తి మేఘాల మీద నా ముందుకు వచ్చాడు. అతడు మహా వృద్ధుని సముఖంలోకి వచ్చాడు.
14
ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options