అపొస్తలుల కార్యములు 6:1-7
1
ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు, ప్రతీ రోజు ఆహారం పంచిపెట్టే విషయంలో, గ్రీకు విధవరాండ్రను పట్టించుకోవడం లేదని గ్రీకుభాష మాట్లాడే యూదులు హెబ్రీభాష మాట్లాడే యూదుల మీద సణుగుకొన్నారు.
2
కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు మిగిలిన విశ్వాసులందరిని ఒకచోటకు పిలిపించి వారితో, “మేము దేవుని వాక్య పరిచర్యను నిర్లక్ష్యం చేసి భోజన బల్లల గురించి కనిపెట్టుకొని ఉండడం సరికాదు.
3
కాబట్టి సహోదరి సహోదరులారా, ఆత్మతో, జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము.
4
అప్పుడు మేము ప్రార్థనపై, వాక్య పరిచర్యపై శ్రద్ధ వహించగలం” అని చెప్పారు.
5
ఈ ఆలోచన అందరికి నచ్చింది. కాబట్టి వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండిన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదా మతంలోనికి మారిన అంతియొకయ నివాసియైన నికోలాసు అనే వారిని ఏర్పరచుకున్నారు.
6
వారిని అపొస్తలుల ముందు నిలబెట్టినప్పుడు, వారు వీరిపై చేతులుంచి ప్రార్థన చేశారు.
7
కాబట్టి దేవుని వాక్యం వ్యాపించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అతివేగంగా పెరిగింది, యాజకులలో కూడా చాలామంది విశ్వాసానికి లోబడ్డారు.
Settings