Skip to content
2 రాజులు 10:15-23

2 రాజులు 10:15-23

15
అతడు అక్కడినుండి బయలుదేరిన తర్వాత, తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కుమారుడైన యెహోనాదాబును చూశాడు. యెహు అతనికి శుభమని చెప్పి, “నేను నీతో యథార్థంగా ఉన్నట్లు నీవు నాతో ఉన్నావా?” అని అడిగాడు. అందుకు యెహోనాదాబు, “ఉన్నాను” అని జవాబిచ్చాడు. “అలాగైతే, నీ చేయి ఇవ్వు” అని యెహు అనగానే అతడు తన చేయి అందించగా యెహు అతన్ని రథంలోకి ఎక్కించుకున్నాడు.
16
యెహు, “నాతో వచ్చి యెహోవా కోసం నేను ఎంత రోషం కలిగి ఉన్నానో చూడు” అని చెప్పి తన రథంలో అతన్ని తీసుకెళ్లాడు.
17
యెహు సమరయకు వచ్చినప్పుడు, అక్కడ మిగిలి ఉన్న అహాబు వంశం వారినందరిని చంపాడు; ఏలీయాతో యెహోవా చెప్పిన మాట ప్రకారం అతడు వారిని నిర్మూలం చేశాడు.
18
తర్వాత యెహు ప్రజలందరినీ సమకూర్చి, “అహాబు బయలుకు కొంచెం సేవ చేశాడు; కాని యెహు మరి ఎక్కువ సేవ చేస్తాడు.
19
కాబట్టి ఇప్పుడు బయలు ప్రవక్తలందరినీ, అతని సేవకులందరినీ, అతని పూజారులందరినీ పిలిపించండి. ఎవరూ మానకుండా అందరు ఉండేలా చూడండి. ఎందుకంటే, నేను బయలుకు గొప్ప బలి అర్పిస్తాను. రాని వారిని బ్రతకనివ్వను” అని వారితో అన్నాడు. అయితే బయలు సేవకులను నాశనం చేద్దామని యెహు ఇలా యుక్తిగా చేశాడు.
20
యెహు, “బయలుకు పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయండి” అని చెప్పగా వారలాగే ప్రకటించారు.
21
తర్వాత యెహు ఇశ్రాయేలంతటికి కబురు పంపాడు, బయలు సేవకులంతా వచ్చారు; ఏ ఒక్కడు రాకుండా లేడు. వారంతా బయలు గుడిలో ప్రవేశించగా బయలు గుడి ఈ చివర నుండి ఆ చివర వరకు వారితో నిండిపోయింది.
22
యెహు దుస్తుల గది మీద అధికారితో, “బయలు సేవకులందరికీ అంగీలు తీసుకురా” అని చెప్పాడు. అతడు వారి కోసం అంగీలు తెచ్చాడు.
23
తర్వాత యెహు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు బయలు గుడిలోకి వెళ్లారు. యెహు బయలు సేవకులతో, “ఇక్కడ మీ మధ్య యెహోవా సేవకులు ఎవరూ లేకుండా చూడండి, బయలు సేవకులు మాత్రమే ఉండాలి” అని చెప్పాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options