2 దినవృత్తాంతములు 6:28-40
28
“దేశంలో కరువు గాని తెగులు గాని వడగాలి గాని నాచు గాని మిడతలు గాని పురుగులు గాని వచ్చినా, వారి శత్రువు వారి పట్టణాల్లో వారిని ముట్టడి చేసినా, ఏదైనా విపత్తు గాని రోగం గాని వచ్చినా,
29
మీ ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా తమ వేదన బాధలు తెలుసుకొని ఈ మందిరం వైపు తమ చేతులను చాచి ప్రార్థన విన్నపం చేస్తే,
30
ప్రతి మనిషి హృదయం మీకు తెలుసు కాబట్టి మీ నివాసస్థలమైన పరలోకం నుండి విని క్షమించి, ఎవరు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతిఫలమివ్వండి (ఎందుకంటే ప్రతి మానవ హృదయం మీకు తెలుసు),
31
అప్పుడు మీరు మా పూర్వికులకిచ్చిన ఈ దేశంలో వారు బ్రతికి ఉన్నంత కాలం మీకు భయపడి, మీకు విధేయులై మీ మార్గంలో వారు నడుస్తారు.
32
“మీ ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించని విదేశీయులు, మీ గొప్ప పేరును బట్టి, మీ బలమైన బాహువును చాచిన మీ చేతులను బట్టి దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
33
మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి. విదేశీయులు మిమ్మల్ని ఏమి అడిగినా అది వారికి చేయండి. అప్పుడు భూలోక ప్రజలు మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా మీ పేరు తెలుసుకొని మీకు భయపడతారు. నేను కట్టిన ఈ మందిరం మీ పేరు కలిగి ఉందని తెలుసుకుంటారు.
34
“మీ ప్రజలు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్లినప్పుడు, మీరు వారిని ఎక్కడికి పంపినా, మీరు ఎన్నుకున్న ఈ పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి, వారు మీకు ప్రార్థన చేస్తే,
35
అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి.
36
“పాపం చేయని మనుష్యులు లేరు కాబట్టి వారు మీకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు, మీరు వారిపై కోప్పడి శత్రువులకు అప్పగిస్తే, వారు వీరిని దూరంగా లేదా దగ్గరగా ఉన్న దేశానికి బందీలుగా తీసుకెళ్తారు;
37
అప్పుడు వారు బందీగా ఉన్న దేశంలో వారి హృదయాలు మారి పశ్చాత్తాపపడి, ‘మేము తప్పు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి పాపం చేశాం’ అని వారు వేడుకుంటే,
38
తాము బందీగా ఉన్న దేశంలో వారు తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో మరలా మీ వైపు తిరిగి, వారి పూర్వికులకు మీరు ఇచ్చిన దేశం వైపు, మీరు ఎన్నుకున్న పట్టణం వైపు, నేను మీ నామం కోసం కట్టిన మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే,
39
అప్పుడు మీ నివాసస్థలమైన పరలోకం నుండి వారి ప్రార్థన, వారి విన్నపాలను విని వారి పక్షాన ఉండండి. మీకు విరుద్ధంగా పాపం చేసిన మీ ప్రజలను క్షమించండి;
40
“నా దేవా! ఈ స్థలంలో చేసిన ప్రార్థనపై మీ కనుదృష్టి ఉంచండి. చెవులారా ఆలకించండి.
Settings