Skip to content
2 దినవృత్తాంతములు 24:18-27

2 దినవృత్తాంతములు 24:18-27

18
అప్పుడు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి అషేరా స్తంభాలకు, విగ్రహాలకు పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధం కారణంగా దేవుని కోపం యూదా వారిమీదికి, యెరూషలేము వారిమీదికి వచ్చింది.
19
అయినా, వారిని తన వైపుకు మళ్ళించాలని యెహోవా తన ప్రవక్తలను వారి దగ్గరకు పంపాడు. ప్రవక్తలు సాక్ష్యమిస్తూ వారిని హెచ్చరించారు కాని వారు ప్రవక్త మాటలు పెడచెవిని పెట్టారు.
20
ఆ సమయంలో దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు ప్రజలు ముందు నిలబడి, “దేవుడు చెప్పే మాట ఇదే: ‘యెహోవా ఆజ్ఞలను మీరెందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు’ ” అన్నాడు.
21
అయితే వారు అతని మీద కుట్రపన్ని అతన్ని యెహోవా ఆలయ ఆవరణంలో రాళ్లతో కొట్టి చంపారు. రాజు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారమే అలా జరిగింది.
22
జెకర్యా తండ్రియైన యెహోయాదా తనపై చూపిన దయను యోవాషు రాజు మరచిపోయే, అతని కుమారున్ని చంపించాడు. జెకర్యా చనిపోతూ చివరిగా, “యెహోవా ఇది చూసి విచారణ చేస్తారు” అన్నాడు.
23
ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యం యోవాషు మీదికి దండెత్తి వచ్చింది. వారు యూదాపై యెరూషలేముపై దాడిచేసి ప్రజల నాయకులందరిని చంపారు. కొల్లసొమ్మంతా దమస్కులో ఉన్న వారి రాజుకు పంపారు.
24
వచ్చిన సిరియా సైన్యం చిన్నదే అయినా చాలా పెద్ద సైన్యాన్ని యెహోవా వారి వశం చేశాడు. యూదా తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి అలా జరిగింది. యోవాషు కూడా తీర్పుకు గురి అయ్యాడు.
25
సిరియావారు తిరిగి వెళ్లేటప్పుడు గాయాలతో ఉన్న యోవాషును వదిలేశారు. యాజకుడైన యెహోయాదా కుమారుడిని చంపినందుకు అతని అధికారులు అతనిపై కుట్రపన్ని అతన్ని అతని మంచం మీద చంపారు. కాబట్టి అతడు చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు, అయితే రాజుల సమాధుల్లో కాదు.
26
అతనిపై అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడైన జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడైన యెహోజాబాదు కుట్రపన్నారు.
27
యోవాషు కుమారుల గురించి, అతని గురించి చెప్పిన ప్రవచనాల విషయం, దేవుని మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చిన విషయం రాజు గ్రంథ వ్యాఖ్యానంలో వ్రాసి ఉన్నాయి. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options