1 కొరింథీయులకు 15:19-43
19
కేవలం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయంగా ఉంటాము.
20
ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు.
21
ఒక్క మనుష్యుని ద్వారా మరణం వచ్చింది కాబట్టి మృతుల పునరుత్థానం కూడ ఒక్క మనుష్యుని ద్వారానే వస్తుంది.
22
ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.
23
అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమ ఫలము. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు.
24
క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని అధికారాన్ని బలాన్ని నాశనం చేసి తండ్రియైన దేవునికి రాజ్యానికి అప్పగిస్తారు. అప్పుడు అంతం వస్తుంది.
25
ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు.
26
చివరిగా నశించే శత్రువు మరణం.
27
“దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు” అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా మిగిలిన వాటన్నిటిని ఆయన క్రింద ఉంచారని అర్థం.
28
ఆయన ఇది చేసినప్పుడు, దేవుడే అన్నిటిలో సర్వమై ఉండేలా, కుమారుడు తనకు సమస్తాన్ని లోబరచిన దేవునికి తానే లోబడతారు.
29
ఇప్పుడు పునరుత్థానం లేకపోతే, మరి మృతుల కోసం బాప్తిస్మం పొందినవారు ఏం చేస్తారు? మరణించినవారు ఎన్నటికి లేపబడకపోతే, ప్రజలు వారి కోసం ఎందుకు బాప్తిస్మం పొందుతున్నారు?
30
మరి అనుక్షణం మేము ఎందుకు ప్రాణభయంతో ఉండాలి?
31
సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసు క్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి రోజూ చస్తూనే ఉన్నాను.
32
కాని, కేవలం మానవరీతిగా ఎఫెసులోని మృగాలతో నేను పోరాడితే నాకు లాభమేంటి? ఒకవేళ మరణించినవారు లేపబడకపోతే, “రేపు చనిపోతాం కాబట్టి, మనం తిని త్రాగుదాం.”
33
మోసపోకండి: “దుష్టులతో సహవాసం మంచి ప్రవర్తనను పాడుచేస్తుంది.”
34
మీరు నీతిప్రవర్తన కలిగి పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గురించి తెలియదు కాబట్టి, మీరు సిగ్గుపడాలని ఇలా చెప్తున్నాను.
35
“చనిపోయినవారు ఎలా లేపబడతారు? వారికి ఎలాంటి శరీరం ఉంటుంది?” అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.
36
మూర్ఖుడా! నీవు ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది చనిపోతేనే తప్ప మొలకెత్తదు.
37
గోధుమ గింజనైన, మరొక దానినైన నీవు భూమిలో నాటినప్పుడు విత్తనం మాత్రమే నాటావు గాని పెరిగిన మొక్క కాదు.
38
అయితే దేవుడు తాను నిర్ణయించిన శరీరాన్ని దానికి ఇస్తారు. ఆయన ప్రతి ఒక్క గింజకు దాని సొంత శరీరాన్ని ఇస్తారు.
39
శరీరాలన్ని ఒకేలా ఉండవు. మానవుల మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షుల మాంసం వేరు, చేపల మాంసం వేరు.
40
అలాగే ఆకాశ శరీరాలు ఉన్నాయి, భూలోక శరీరాలు ఉన్నాయి; ఆకాశ శరీరాల మహిమ వేరు, భూశరీరాల మహిమ వేరు.
41
సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలో భేదం ఉంటుంది.
42
మృతుల పునరుత్థానం కూడా ఇలాగే ఉంటుంది. నశించిపోయే శరీరం నాటబడి నాశనంలేనిదిగా లేపబడుతుంది.
43
ఘనహీనంగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది; అది బలహీనమైనదిగా విత్తబడి శక్తిగలదానిగా లేపబడుతుంది.
Settings