Skip to content

కీర్తనలు102

1
దుఃఖముచేత ప్రాణము సొమ్మసిల్లినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన వినండి; సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.
2
నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. మీ చెవి నా వైపు త్రిప్పండి; నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.
3
నా దినాలు పొగలా కనుమరుగు అవుతున్నాయి; నా ఎముకలు నిప్పుకణాల్లా కాలిపోతున్నాయి.
4
దెబ్బకు వాడిన గడ్డిలా ఉంది నా హృదయం; నేను భోజనం చేయడం మరచిపోతున్నాను.
5
నా బాధలో నేను గట్టిగా మూలుగుతూ ఉన్నందుకు నేను అస్థిపంజరంలా ఉన్నాను.
6
నేను ఎడారి గుడ్లగూబలా, శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను.
7
నేను మేల్కొని ఉన్నాను; ఇంటికప్పు మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఉన్నాను.
8
రోజంతా నా శత్రువులు నన్ను తిడతారు; నన్ను ఎగతాళి చేసేవారు నా పేరును శాపంగా ఉపయోగిస్తారు.
9
నేను బూడిదను ఆహారంగా తింటున్నాను పానీయంలో కన్నీరు కలిపి త్రాగుతున్నాను.
10
మీ ఉగ్రతను బట్టి; మీరు నన్ను ఎత్తి అవతల విసిరివేశారు.
11
నా రోజులు సాయంకాలపు నీడలా ఉన్నాయి; నేను గడ్డిలా వాడిపోతున్నాను.
12
కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు; మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
13
మీరు లేచి సీయోనుపై కనికరం చూపిస్తారు, ఎందుకంటే ఆమెపై దయ చూపే సమయం వచ్చింది; నిర్ణీత సమయం వచ్చింది.
14
దాని రాళ్లు మీ సేవకులకు ఇష్టమైనవి; దుమ్ము వారికి దయ కలిగించింది.
15
జనులు యెహోవా నామానికి భయపడతారు, భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు.
16
ఎందుకంటే యెహోవా సీయోనును పునర్నిర్మించి తన మహిమతో ప్రత్యక్షమవుతారు.
17
దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు; ఆయన వారి మనవులను త్రోసివేయరు.
18
ఇది రాబోయే తరాల కోసం వ్రాయబడును గాక, ఇంకా సృజించబడని ప్రజలు యెహోవాను స్తుతించుదురు గాక:
19
“బందీల మూలుగులు వినడానికి మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి, యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు, పరలోకంలో నుండి భూమిని చూశారు.”
21
ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు రాజ్యాలు యెహోవాను ఆరాధించడానికి సమాజముగా కూడుతారో అప్పుడు సీయోనులో యెహోవా నామం ప్రకటించబడుతుంది యెరూషలేములో ఆయన స్తుతించబడతారు.
23
నా జీవిత గమనంలో నా బలాన్ని కృంగదీశారు; ఆయన నా రోజుల్ని తగ్గించారు.
24
అందుకు నేనన్నాను: నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి; మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి.
25
ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.
26
అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు అవి అంతరిస్తాయి.
27
కాని మీరు అలాగే ఉంటారు, మీ సంవత్సరాలకు అంతం ఉండదు.
28
మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు; వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options