సంఖ్యాకాండము 19:1-10
1
యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు:
2
యెహోవా ఆజ్ఞాపించిన నియమానికి ఇది అవసరం: ఇశ్రాయేలీయులు లోపం లేని లేదా మచ్చలేని కాడి మోయని ఎర్రని పెయ్యను మీ దగ్గరకు తేవాలని చెప్పండి.
3
దానిని యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి; అతని ఎదుట శిబిరం బయట దానిని వధించాలి.
4
అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత వ్రేలితో తీసుకుని సమావేశ గుడారం ముందు భాగం వైపు ఆ రక్తాన్ని ఏడుసార్లు చిలకరించాలి.
5
అతడు చూస్తుండగా ఆ పెయ్య కాల్చివేయబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, పేడ అంతా కాల్చివేయబడాలి.
6
అప్పుడు యాజకుడు కొంత దేవదారు కర్రను, హిస్సోపు చెట్టురెమ్మను ఎర్ర దారాన్ని తీసుకుని పెయ్యను కాల్చి నిప్పులో వెయ్యాలి.
7
తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి. తర్వాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు గాని సాయంత్రం వరకు ఆచారరీత్య అపవిత్రుడే.
8
ఆ పెయ్యను దహించు వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు అతడు అపవిత్రుడే.
9
పవిత్రుడైనవాడు ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరం బయట ఆచార ప్రకారం శుభ్రమైన చోట ఉంచాలి. అది శుద్ధి జలంలో వాడబడడానికి ఇశ్రాయేలు సమాజం ద్వారా పెట్టబడాలి; అది పాపపరిహారబలి.
10
పెయ్య బూడిదను పోగుచేసిన వ్యక్తి కూడా తన బట్టలు ఉతుక్కోవాలి, అతడు సాయంత్రం వరకు అపవిత్రునిగా ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకు, వారి మధ్య నివసిస్తున్న విదేశీయులకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
Settings