Skip to content
మార్కు 4:1-20

మార్కు 4:1-20

1
యేసు మరల సరస్సు ఒడ్డులో బోధించడం మొదలుపెట్టారు. ఆయన చుట్టూ ఉన్న గుంపు పెద్దగా ఉండడం వల్ల ఆయన సరస్సులో ఒక పడవను ఎక్కి కూర్చున్నారు, ప్రజలంతా ఒడ్డున నిలబడి ఉన్నారు.
2
ఆయన ఉపమానాలతో అనేక విషయాలను వారికి బోధిస్తూ ఈ విధంగా చెప్పారు:
3
“ఇటు వినండి! ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు.
4
అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేశాయి.
5
మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి, మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి.
6
కానీ సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ మొలకలు వాడిపోయి, వాటికి వేరు లేదా అవి ఎండిపోయాయి.
7
మరికొన్ని విత్తనాలు ముళ్ళపొదల్లో పడ్డాయి, ఆ ముళ్ళపొదలు పెరిగి వాటిని అణచి వేశాయి, కాబట్టి అవి పంటను ఇవ్వలేదా పోయాయి.
8
మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, ఎదిగి, కొన్ని ముప్పైరెట్లు, కొన్ని అరవైరెట్లు, కొన్ని వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.”
9
అప్పుడు యేసు, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.
10
ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ పన్నెండు మందితో పాటు ఆయన చుట్టూ ఉన్న కొందరు ఉపమానాల గురించి ఆయనను అడిగారు.
11
అందుకు ఆయన ఈ విధంగా చెప్పారు, “దేవుని రాజ్యం గురించిన మర్మానికి సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది. కాని బయటివారికి ప్రతి విషయం ఉపమాన రీతిగానే చెప్పబడింది.
12
తద్వారా, “ ‘వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు, ఎప్పుడూ వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు; లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొంది ఉండేవారు!’”
13
తర్వాత యేసు వారితో, “మీరు ఈ ఉపమానం అర్థం చేసుకోలేదా? అలాగైతే ఇతర ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు?
14
రైతు వాక్యం విత్తుతున్నాడు.
15
కొందరు దారి ప్రక్కన పడిన విత్తనంలాంటి వారు, అక్కడ వాక్యం విత్తబడింది. వారు వినిన వెంటనే, సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు.
16
మరికొందరు, రాతి నేలలో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరిస్తారు.
17
అయితే వారిలో వేరు లేకపోవడంతో, వారు కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు, వారు త్వరగా పడిపోతారు.
18
ఇంకా ఇతరులు ముళ్ళపొదల్లో పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు.
19
కాని జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ధనమోసం ఇతర కోరికలు ఆ వాక్యాన్ని అణచివేసి, ఫలించకుండా చేస్తాయి.
20
ఇక మిగిలిన వారు, సారవంతమైన నేల మీద పడిన విత్తనాల వంటివారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని అంగీకరిస్తారు, వారిలో కొందరు విత్తబడిన దానికి ముప్పైరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు వందరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options