యిర్మీయా 36:10-26
10
యెహోవా మందిరంలో కార్యదర్శియైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో యెహోవా మందిర క్రొత్త ద్వార ప్రవేశం దగ్గర ప్రజలందరికి వినిపించేలా బారూకు గ్రంథపుచుట్టలో నుండి యిర్మీయా చెప్పిన మాటలను చదివాడు.
11
షాఫాను మనుమడును గెమర్యా కుమారుడునైన మీకాయా ఆ గ్రంథపుచుట్టలో నుండి చదవబడిన యెహోవా చెప్పిన మాటలన్నీ విని,
12
అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు.
13
బారూకు ఆ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించిన ప్రతిదీ మీకాయా వారికి చెప్పిన తర్వాత,
14
“నీవు ఏ గ్రంథపుచుట్ట నుండి ప్రజలకు చదివి వినిపించావో దాన్ని తీసుకుని రా” అని బారూకుకు చెప్పడానికి అధికారులందరు కలిసి కూషీ కుమారుడైన షెలెమ్యా, అతని కుమారుడైన నెతన్యా, అతని కుమారుడైన యెహూదిని పంపారు. కాబట్టి నేరియా కుమారుడైన బారూకు ఆ గ్రంథపుచుట్టను తీసుకుని వారి దగ్గరకు వెళ్లాడు.
15
వారు అతనితో, “దయచేసి కూర్చుని, మాకు దాన్ని చదివి వినిపించండి” అని అడిగారు. కాబట్టి బారూకు దానిని వారికి చదివి వినిపించాడు.
16
వారు ఈ మాటలు విని భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని బారూకుతో, “ఈ మాటలన్నీ మనం తప్పక రాజుకు తెలియజేయాలి” అని అన్నారు.
17
అప్పుడు వారు బారూకును, “నీవు ఇవన్నీ ఎలా వ్రాశావు? యిర్మీయా చెప్పాడా? మాకు చెప్పు” అని అడిగారు.
18
అందుకు బారూకు, “అవును, ఇవన్నీ అతడు చెప్తుండగా, నేను ఈ గ్రంథపుచుట్టలో వ్రాశాను” అని జవాబిచ్చాడు.
19
అప్పుడు అధికారులు బారూకుతో, “నీవు, అలాగే యిర్మీయా కూడా వెళ్లి దాక్కోండి. మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియకూడదు” అని చెప్పారు.
20
తర్వాత వారు ఆ గ్రంథపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో పెట్టి, తన భవన ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, జరిగినదంతా ఆయనతో చెప్పారు.
21
అప్పుడు రాజు ఆ గ్రంథపుచుట్టను తెమ్మని యెహూదిని పంపినప్పుడు, అతడు వెళ్లి లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తెచ్చి రాజుకు, ఆయన ప్రక్కన నిలబడి ఉండిన అధికారులందరికి చదివి వినిపించాడు.
22
అది తొమ్మిదవ నెల కాబట్టి రాజు శీతాకాలపు భవనంలో మంటలు మండుతున్న కుంపటి ముందు కూర్చుని ఉన్నాడు.
23
యెహూది గ్రంథపుచుట్టలోని మూడు నాలుగు వరుసలను చదివినప్పుడల్లా, రాజు వాటిని లేఖికుని కత్తితో కోసి మండుతున్న కుంపటిలో విసురుతూ ఉన్నాడు, ఆ గ్రంథపుచుట్టను పూర్తిగా కాల్చివేసే వరకు రాజు అలాగే చేశాడు.
24
ఈ మాటలన్నీ విన్న రాజు గాని అతని సహాయకులెవ్వరు గాని భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు.
25
ఆ గ్రంథపుచుట్టను కాల్చవద్దు అంటూ ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును అభ్యర్థించారు, కాని రాజు వారి అభ్యర్థనను వినిపించుకోలేదు.
26
పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.
Settings