Skip to content
యిర్మీయా 25:1-10

యిర్మీయా 25:1-10

1
యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.
2
కాబట్టి యిర్మీయా ప్రవక్త యూదా ప్రజలందరితో, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో ఇలా అన్నాడు:
3
యూదా రాజైన ఆమోను కుమారుడైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఇరవై మూడు సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు వస్తూ ఉండింది. నేను మీతో పదే పదే మాట్లాడాను కానీ మీరు వినలేదు.
4
యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరినీ మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ పంపినా మీరు వినలేదు లేదా పట్టించుకోలేదు.
5
వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు.
6
ఇతర దేవుళ్ళ విగ్రహాలను మీరు సేవించవద్దు, పూజించవద్దు, వాటిని అనుసరించవద్దు; మీ చేతిపనుల వలన మీరు నాకు కోపం రేపవద్దు; అప్పుడు నేను మీకు హాని చేయను” అని చెప్పారు.
7
“కాని మీరు నా మాట వినలేదు, మీ చేతులు చేసిన వాటితో మీరు నా కోపాన్ని రేపి, మీకే హాని తెచ్చుకున్నారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
8
కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు నా మాటలు వినలేదు కాబట్టి,
9
నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను.
10
నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options