ద్వితీయోపదేశకాండము 15:7-15
7
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు.
8
కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి.
9
ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.
10
వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు.
11
దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.
12
మీ ప్రజల్లో హెబ్రీ పురుషులే గాని స్త్రీలే గాని మీకు అమ్ముకుని ఆరు సంవత్సరాలు మీకు సేవ చేస్తే, ఏడవ సంవత్సరంలో మీరు వారిని స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి.
13
మీరు వారిని విడుదల చేసినప్పుడు, వారిని వట్టి చేతులతో పంపకూడదు.
14
మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి.
15
మీరు ఈజిప్టులో దాసులై ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించారని జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే నేను ఈ రోజు మీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను.
Settings