Skip to content
1 సమూయేలు 22:11-19

1 సమూయేలు 22:11-19

11
అప్పుడు రాజు, యాజకుడును అహీటూబు కుమారుడునైన అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటివారైన యాజకులందరిని పిలుచుకురమ్మని పంపించాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు,
12
సౌలు, “అహీటూబు కుమారుడా, విను” అని అన్నాడు. అందుకతడు, “చిత్తం ప్రభువా” అని జవాబిచ్చాడు.
13
సౌలు అతనితో, “నీవూ యెష్షయి కుమారుడు కలిసి ఎందుకు నా మీద కుట్ర చేశారు? నీవు అతనికి ఆహారాన్ని ఖడ్గాన్ని ఇచ్చి అతని తరపున దేవుని దగ్గర విచారణ చేశావు, అందుకు అతడు నా మీద తిరుగుబాటు చేస్తూ ఇలా ఈ రోజు నా కోసం పొంచి ఉన్నాడు” అని అన్నాడు.
14
అందుకు అహీమెలెకు, “రాజా, దావీదువంటి నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతడు రాజుకు అల్లుడు, నీ అంగరక్షకుల నాయకుడు, నీ కుటుంబంలో ఎంతో గౌరవం ఉన్నవాడు.
15
అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఈ రోజే ప్రారంభించానా? కాదు కదా! ఈ విషయం గురించి నీ సేవకుడనైన నాకు ఏమాత్రం తెలియదు కాబట్టి రాజు తన సేవకుని మీద గాని అతని తండ్రి ఇంటివారి మీద నేరం మోపకూడదు” అన్నాడు.
16
అయితే రాజు, “అహీమెలెకూ, నీవు నీ తండ్రి ఇంటివారందరు తప్పక చస్తారు” అన్నాడు.
17
తర్వాత, “యెహోవా యాజకులైన వీరు దావీదు పక్షం ఉన్నారు. అతడు పారిపోయిన విషయం తెలిసినా నాకు చెప్పలేదు కాబట్టి మీరు వెళ్లి వీరందరిని చంపండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులకు ఆజ్ఞాపించాడు. అయితే రాజు అధికారులు యెహోవా యాజకులను చంపడానికి ఒప్పుకోలేదు.
18
కాబట్టి రాజు దోయేగుతో, “నీవు ఈ యాజకుల మీద పడి చంపు” అన్నాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి నార ఏఫోదు ధరించి ఉన్న ఎనభై అయిదుగురిని ఆ రోజున చంపాడు.
19
అతడు యాజకుల పట్టణమైన నోబులో ఉంటున్న వారందరిని అనగా మగవారిని ఆడవారిని పిల్లలను చంటి పిల్లలను పశువులను గాడిదలను గొర్రెలను కత్తితో చంపాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options