కీర్తనలు 89:1-18
1
ఎజ్రాహీయుడైన ఏతాను ధ్యానకీర్తన. యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను; నా నోటితో మీ నమ్మకత్వాన్ని అన్ని తరాలకు తెలియజేస్తాను.
2
మీ ప్రేమ ఎల్లప్పుడు దృఢంగా నిలిచి ఉంటుందని, మీ నమ్మకత్వాన్ని మీరు పరలోకంలోనే స్థాపించారని నేను ప్రకటిస్తాను.
3
“నేను ఏర్పరచుకున్న వానితో నేను ఒడంబడిక చేశాను, నా సేవకుడైన దావీదుకు ప్రమాణం చేశాను.
4
‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను మీ సింహాసనాన్ని అన్ని తరాలకు స్థిరపరుస్తాను’ ” అని మీరన్నారు. సెలా
5
యెహోవా, ఆకాశాలు మీ అద్భుతాలను స్తుతిస్తున్నాయి, అలాగే పరిశుద్ధుల సభలో మీ నమ్మకత్వం స్తుతించబడుతుంది.
6
అంతరిక్షాల్లో యెహోవాతో పోల్చదగిన వారు ఎవరు? దైవపుత్రులలో ఆయనకు సాటి ఎవరు?
7
పరిశుద్ధుల సభలో దేవుడు మహా భీకరుడు; తన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన అధిక గౌరవనీయుడు.
8
సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు? యెహోవా మీరు మహా బలాఢ్యులు, మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.
9
పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు; అలలను మీరు అణచివేస్తారు.
10
చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును నలగ్గొట్టారు; మీ బలమైన బాహువు శత్రువులను చెదరగొట్టింది.
11
ఆకాశాలు మీవే, భూమి కూడ మీదే; లోకాన్ని దానిలో ఉన్నదంతా మీరే స్థాపించారు.
12
ఉత్తర దక్షిణ దిక్కులను మీరే సృజించారు; తాబోరు హెర్మోను పర్వతాలు మీ నామాన్ని బట్టి ఆనంద గానం చేస్తున్నాయి.
13
మీ బాహువు శక్తి కలది; మీ చేయి బలమైనది, మీ కుడిచేయి ఘనమైనది.
14
నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు; మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి.
15
యెహోవా, మీ గురించి ఆనంద కేకలు వేసేవారు ధన్యులు, మీ సన్నిధి కాంతిలో వారు నడుస్తారు.
16
రోజంతా మీ నామాన్ని బట్టి వారు ఆనందిస్తారు; మీ నీతిని బట్టి వారు హర్షిస్తారు.
17
ఎందుకంటే వారి మహిమ వారి బలం మీరే, మీ దయతో మా కొమ్మును హెచ్చిస్తారు.
18
నిజానికి, మా డాలు యెహోవాకు చెందినది, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధునికి చెందిన వాడు.
Settings