Skip to content
లేవీయకాండము 10:1-11

లేవీయకాండము 10:1-11

1
అహరోను కుమారులు నాదాబు, అబీహు తమ ధూపార్తులను తీసుకుని, వాటిలో నిప్పు ఉంచి దానిపై ధూపం వేశారు; వారు యెహోవా ఎదుట ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా అనధికార అగ్నిని సమర్పించారు.
2
కాబట్టి యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని దహించివేయగా, వారు యెహోవా ఎదుట చనిపోయారు.
3
అప్పుడు మోషే అప్పుడు అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఇలా చెప్పారు: “ ‘నన్ను సమీపించేవారి ద్వారా నేను నా పరిశుద్ధతను కనుపరచుకుంటాను; ప్రజలందరి దృష్టిలో నేను ఘనపరచబడతాను.’ ” అహరోను మౌనంగా ఉండిపోయాడు.
4
మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫానులను పిలిపించి వారితో, “ఇక్కడకు రండి; మీ బంధువులను పరిశుద్ధాలయం ఎదుట నుండి, బయటకు తీసుకెళ్లండి” అని అన్నాడు.
5
కాబట్టి వారు వచ్చి, మోషే ఆజ్ఞాపించినట్లుగా, శిబిరం బయట ఇప్పటికీ తమ వస్త్రాలతో వాటిని తీసుకెళ్లారు.
6
మోషే అహరోనుతో అతని కుమారులైన ఎలియాజరు, ఈతామారులతో, “మీరు చావకూడదన్నా, యెహోవా ఆగ్రహం ఈ సమాజం మీదికి రావద్దన్నా మీరు మీ జుట్టు విరబోసుకోవద్దు, మీ బట్టలు చింపుకోవద్దు, అయితే యెహోవా అగ్నితో వారిని నాశనం చేసినందుకు మీ బంధువులైన ఇశ్రాయేలీయులందరు దుఃఖించవచ్చు.
7
యెహోవా యొక్క అభిషేక తైలం మీమీద ఉంది కాబట్టి సమావేశ గుడారం యొక్క ప్రవేశం వదిలి వెళ్లొద్దు, వెళ్తే మీరు చస్తారు” అని అన్నాడు. కాబట్టి వారు మోషే చెప్పినట్లు చేశారు.
8
తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నారు,
9
“నీవూ, నీ కుమారులు సమావేశ గుడారంలోకి ఎప్పుడు వెళ్లినా మద్యం త్రాగకూడదు ఇతర పులిసిన పానీయం త్రాగకూడదు, ఒకవేళ అలా చేస్తే మీరు చస్తారు. మీ రాబోయే తరాలకు ఇది నిత్య సంస్కారంగా ఉంటుంది.
10
పరిశుద్ధమైన దానికి సాధారణమైన దానికి, అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించగలిగేలా,
11
యెహోవా మోషే ద్వార ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలన్నిటిని మీరు వారికి బోధించాలి.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options