న్యాయాధిపతులు 8:1-10
1
అయితే ఎఫ్రాయిమీయులు, “నీవు మా పట్ల ఇలా ఎందుకు చేశావు? మిద్యానీయులతో యుద్ధం చెయ్యడానికి నీవు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలువలేదు?” అని గిద్యోనుతో తీవ్రంగా వాదించారు.
2
అయితే అతడు, “మీతో పోల్చుకుంటే నేను సాధించింది ఏంటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా?
3
దేవుడు మిద్యానీయుల నాయకులైన ఓరేబు, జెయేబులను మీకు అప్పగించారు. మీతో పోల్చుకుంటే నేనేమి చేయగలిగాను?” అని అన్నాడు. అతడు అలా చెప్పినప్పుడు అతని మీద వారి కోపం తగ్గింది.
4
గిద్యోను, అతనితో ఉన్న మూడువందలమంది అలసిపోయిన కూడా శత్రువులను తరుముతూ యొర్దాను దగ్గరకు వచ్చి, దానిని దాటారు.
5
అతడు సుక్కోతు వారితో, “నా సైనికులకు కొంత ఆహారం ఇవ్వండి; వారు అలసిపోయి ఉన్నారు, నేను ఇంకా మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాను” అన్నాడు.
6
కాని సుక్కోతు అధికారులు, “జెబహు, సల్మున్నా అనే వారిని మీరు ఇంకా జయించలేదు కదా? నీ సైన్యానికి మేమెందుకు ఆహారమివ్వాలి?” అన్నారు.
7
అందుకు గిద్యోను, “జెబహు సల్మున్నాను యెహోవా మా చేతికి ఇచ్చిన తర్వాత, ముళ్ళపొదలతోను, ఎడారి కంపలతోను మీ శరీరాలను చీరేస్తాను” అని చెప్పాడు.
8
అక్కడినుండి అతడు పెనూయేలుకు వెళ్లి వారిని కూడా ఆహారం కోసం అలాగే అడిగినప్పుడు, వారు కూడా సుక్కోతు వారిలా జవాబిచ్చారు,
9
కాబట్టి అతడు పెనూయేలు మనుష్యులతో, “నేను సమాధానంతో తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురాన్ని పడగొడతాను” అని చెప్పాడు.
10
అప్పుడు జెబహు, సల్మున్నా, ఇంచుమించు పదిహేను వేలమంది బలగంతో, అనగా తూర్పు ప్రజల సైన్యమంతటిలో మిగిలిన వారితో కర్కోరులో ఉన్నారు; లక్షా ఇరవై వేలమంది సైనికులు అప్పటికే చనిపోయారు.
Settings