కంటెంట్‌కు వెళ్లండి
యోవేలు 2:18-27

యెహోవా పునరుద్ధరణ వాగ్దానం

యోవేలు 2:18-27
18
అప్పుడు యెహోవా తన దేశంపట్ల ఆసక్తి చూపి, ప్రజలను కనికరించారు.
19
యెహోవా వారికి ఇలా జవాబిచ్చారు: “నేను మిమ్మల్ని పూర్తిగా తృప్తిపరచడానికి, ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె పంపుతున్నాను; ఇక ఎన్నడూ మిమ్మల్ని దేశాల్లో అవమానానికి గురిచేయను.
20
“నేను ఉత్తర దిక్కునుండి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా తరిమివేస్తాను. ఎండిపోయిన, నిస్సారమైన ప్రాంతానికి దానిని పంపివేస్తాను; తూర్పు వైపున్న దాని సైన్యం మృత సముద్రంలో మునిగిపోతుంది, పశ్చిమ వైపున్న దాని సైన్యం మధ్యధరా సముద్రంలో మునిగిపోతుంది. అది కంపు కొడుతుంది, దాని దుర్వాసన లేస్తుంది.” నిజంగా ఆయన గొప్పకార్యాలు చేశారు!
21
యూదా దేశమా, భయపడకు; సంతోషించు, ఆనందించు. నిజంగా యెహోవా గొప్పకార్యాలు చేశారు!
22
అడవి జంతువులారా, భయపడకండి, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లు పచ్చగా మారుతున్నాయి. చెట్లు తమ ఫలాలు ఇస్తాయి. అంజూర చెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
23
సీయోను ప్రజలారా, సంతోషించండి, మీ దేవుడైన యెహోవాను బట్టి ఆనందించండి, ఆయన నమ్మదగినవారు కాబట్టి, ఆయన మీకు తొలకరి వర్షం ఇచ్చారు. ఆయన సమృద్ధి వర్షాలు పంపిస్తారు, ఆయన ముందు పంపినట్లు తొలకరి వర్షం, కడవరి వర్షం పంపిస్తారు.
24
నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి, క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.
25
“నేను మీ మధ్యకు పంపిన నా గొప్ప సైన్యం పెద్ద మిడతలు, చిన్న మిడతలు, ఇతర మిడతలు, మిడతల గుంపులు తినేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను.
26
మీరు కడుపునిండా తిని తృప్తి పొందేవరకు మీకు సమృద్ధి ఉంటుంది, మీ కోసం అద్భుతాలు చేసిన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు స్తుతిస్తారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
27
అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నానని, నేను మీ దేవుడైన యెహోవానని, వేరే దేవుడు ఎవరూ లేరని మీరు తెలుసుకుంటారు; ఇక మరెన్నడు నా ప్రజలు సిగ్గుపడరు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options