Skip to content
యిర్మీయా 29:1-10

యిర్మీయా 29:1-10

1
నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారిలో మిగిలి ఉన్న పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ఇతర ప్రజలందరికి యెరూషలేము నుండి యిర్మీయా ప్రవక్త పంపిన ఉత్తరంలోని మాటలు ఇవి.
2
(యెహోయాకీను రాజు, రాజమాత, ఆస్థాన అధికారులు, యూదా, యెరూషలేము నాయకులు, నిపుణులైన పనివారు కళాకారులు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ ఉత్తరం పంపబడినది.)
3
యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది:
4
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు:
5
“ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి.
6
పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది.
7
అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”
8
అవును, ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీ మధ్య ఉన్న ప్రవక్తలు భవిష్యవాణి చెప్పేవారు మిమ్మల్ని మోసగించకుండ చూసుకోండి. మీలో కలలు కనేవారి మాటలు మీరు వినకండి.
9
వారు నా పేరిట అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
10
యెహోవా ఇలా అంటున్నారు: “బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options