Skip to content
యెషయా 55:1-7

యెషయా 55:1-7

1
దాహంతో ఉన్నవారలారా, నీళ్ల దగ్గరకు రండి. డబ్బులేని వారలారా, మీరు వచ్చి కొని తినండి! డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా, ద్రాక్షరసం, పాలు కొనండి.
2
ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు? తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు? వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి, అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు.
3
శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.
4
చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను, జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను.
5
ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు. యెహోవా నిన్ను మహిమపరచడం చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి.
6
యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.
7
దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options