ఆదికాండము 41:46-57
46
యోసేపు ఈజిప్టు రాజైన ఫరో సేవ మొదలుపెట్టినప్పుడు అతని వయస్సు ముప్పై సంవత్సరాలు. యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి, ఈజిప్టు దేశమంతా సంచరించాడు.
47
ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది.
48
యోసేపు ఈజిప్టులో ఆ ఏడు సంవత్సరాల పంటనంతా సేకరించి పట్టణాల్లో నిల్వచేశాడు. ప్రతి పట్టణం చుట్టూ ఉన్న పొలాల్లో సేకరించిన ధాన్యాన్ని ఆ పట్టణాల్లోనే నిల్వచేశాడు.
49
యోసేపు సముద్రతీరాన ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలువచేశాడు; అది విస్తారంగా ఉంది కాబట్టి దాన్ని కొలవడం ఆపేశాడు.
50
కరువు సంవత్సరాలకు ముందు యోసేపుకు ఓనులో యాజకుడైన పోతీఫెర కుమార్తె, ఆసెనతు ద్వారా ఇద్దరు కుమారులు పుట్టారు.
51
తన మొదటి కుమారునికి యోసేపు మనష్షే అని పేరు పెట్టి, “దేవుడు నా కష్టాలన్నీ, నా తండ్రి ఇంటివారందరినీ మరచిపోయేలా చేశారు” అని అన్నాడు.
52
రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టి, “నాకు శ్రమలు కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశారు” అని అన్నాడు.
53
ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి,
54
యోసేపు చెప్పినట్టే ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమయ్యింది. ఇతర దేశాల్లో కరువు ఉన్నది కానీ ఈజిప్టు దేశమంతా ఆహారం ఉంది.
55
ఈజిప్టు అంతా కరువు అనుభవించడం ప్రారంభమైనప్పుడు, ఆహారం కోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. అప్పుడు ఫరో ఈజిప్టు వారందరితో, “యోసేపు దగ్గరకు వెళ్లి అతడు చెప్పినట్టు చేయండి” అని చెప్పాడు.
56
దేశమంతటా కరువు వ్యాపించినప్పుడు, యోసేపు ధాన్య కొట్లన్నీ తెరిచి, ఈజిప్టువారికి ధాన్యం అమ్మాడు, ఎందుకంటే ఈజిప్టు దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉంది.
57
లోకమంతా ఈజిప్టుకు వచ్చి యోసేపు దగ్గర ధాన్యం కొనుగోలు చేశారు, ఎందుకంటే కరువు అంతటా తీవ్రంగా ఉంది.
Settings