ఈజిప్టుపై యెహోవా దినము
1
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
2
“మనుష్యకుమారుడా, ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘రోదిస్తూ అనండి: “అయ్యో, శ్రమ దినం వచ్చిందే!”
3
ఎందుకంటే ఆ రోజు వచ్చేసింది, యెహోవా దినం సమీపించింది, మబ్బులు కమ్ముకునే రోజు, జనాంగాలు శిక్షించబడే రోజు.
4
ఈజిప్టు దేశం మీదికి ఖడ్గం దూసుకువస్తుంది, కూషు మీదికి వేదన వస్తుంది. ఈజిప్టులో హతులైనవారు పడిపోతుంటే, దాని సంపదను తీసుకెళ్లిపోతారు, దాని పునాదులు కూల్చివేయబడతాయి.
5
కూషు వారు, లిబియా వారు (పూతు వారు), లిడియా వారు, అరేబియా అంతా, కూబు వారు, ఇంకా నిబంధన దేశపు ప్రజలు ఈజిప్టుతో పాటు ఖడ్గానికి కూలిపోతారు.
6
“ ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు, దాని బల గర్వం అణిగిపోతుంది. మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలు దాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు. అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
7
పాడైపోయిన దేశాల మధ్య ఈజిప్టువారు దిక్కులేని వారవుతారు. శిథిలమైన పట్టణాల మధ్య వారి పట్టణాలు పడి ఉంటాయి.
8
ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడి దాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
9
“ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.