యెహెజ్కేలు 22:1-16
1
యెహోవా వాక్కు నాకు వచ్చి:
2
“మనుష్యకుమారుడా, నీవు దానికి తీర్పు తీరుస్తావా? రక్తం చిందించిన ఈ పట్టణానికి నీవు తీర్పు తీరుస్తావా? అలా అయితే నీవు దాని అసహ్యమైన ఆచారాలన్నిటిని బట్టి దానిని నిలదీస్తూ
3
ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తన మధ్య రక్తాన్ని చిందిస్తూ, విగ్రహాలను తయారుచేస్తూ తనను తాను అపవిత్రం చేసుకునే నగరమా,
4
నీవు చిందించిన రక్తాన్ని బట్టి నీవు అపరాధివి అయ్యావు, నీవు తయారుచేసిన విగ్రహాల వలన నీవు అపవిత్రం అయ్యావు. నీవే నీ దినాలు దగ్గర పడేలా చేసుకున్నావు, నీ సంవత్సరాలు ముగింపుకు వచ్చాయి. కాబట్టి నేను నిన్ను ఇతర జనాంగాల మధ్య హాస్యాస్పదంగా చేసి, అన్ని దేశాల ఎదుట నవ్వులపాలు చేస్తాను.
5
అపకీర్తి పొందిన పట్టణమా, కలత చెందినదానా, నీకు దగ్గరగా ఉన్నవారు, దూరంగా ఉన్నవారు నిన్ను ఎగతాళి చేస్తారు.
6
“ ‘చూడండి, నీలో ఉన్న ఇశ్రాయేలు నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి హత్యలు చేయాలని నిర్ణయించుకున్నారు.
7
నీలో వారు తండ్రిని తల్లిని అవమానించారు; నీలో వారు పరదేశులను అణచివేశారు, తండ్రిలేనివారిని, విధవరాండ్రను చులకనగా చూశారు.
8
నీవు నా పరిశుద్ధ వస్తువులను తృణీకరించి నా సబ్బాతులను అపవిత్రం చేశావు.
9
అపవాదులు వేసేవారు, రక్తం చిందించేవారు నీలో ఉన్నారు; పర్వత క్షేత్రాల దగ్గర తిని, అసభ్యకరమైన పనులు చేసేవారు నీలో ఉన్నారు.
10
తమ తండ్రి పడకను అవమానపరిచేవారు నీలో ఉన్నారు; బహిష్టు సమయంలో అపవిత్రంగా ఉన్న స్త్రీలను చెరిపినవారు నీలో ఉన్నారు.
11
నీలో ఒకడు తన పొరుగువాని భార్యతో అసహ్యకరమైన నేరం చేస్తాడు, మరొకడు అవమానకరంగా తన కోడలిని అపవిత్రం చేస్తాడు, మరొకడు తన సోదరిని, తన తండ్రి కుమార్తెను చెరుపుతాడు.
12
నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
13
“ ‘నీవు సంపాదించిన అన్యాయ లాభాన్ని, నీవు చేసిన హత్యలు చూసి నా చేతులు చరుచుకుంటాను.
14
నేను నిన్ను శిక్షించే రోజును తట్టుకునే ధైర్యం నీకు ఉంటుందా? నీ చేతులు బలంగా ఉంటాయా? యెహోవానైన నేను చెప్పాను, దానిని నేను నెరవేరుస్తాను.
15
ఇతర జనాంగాల్లోకి నిన్ను చెదరగొట్టి, ఇతర దేశాలకు నిన్ను వెళ్లగొడతాను; నీ అపవిత్రతకు ముగింపు తెస్తాను.
16
నీవు జనాంగాల దృష్టిలో అపవిత్రం అయినప్పుడు, నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.’ ”
Settings