నిర్గమకాండము 15:9-19
9
‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను. దోపుడుసొమ్మును పంచుకుంటాను; వాటివలన నా ఆశ తీర్చుకుంటాను. నేను నా ఖడ్గాన్ని దూస్తాను నా చేయి వారిని నాశనం చేస్తుంది’ అని శత్రువు అనుకున్నాడు.
10
అయితే మీరు మీ శ్వాసను ఊదగా సముద్రం వారిని కప్పేసింది. వారు బలమైన జలాల క్రింద సీసంలా మునిగిపోయారు.
11
యెహోవా, దేవుళ్ళ మధ్యలో మీవంటి వారెవరు? పరిశుద్ధతలో ఘనమైనవారు మహిమలో భీకరమైనవారు, అద్భుతాలు చేసే మీవంటి వారెవరు?
12
“మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది.
13
మీరు విమోచించిన ప్రజలను మారని మీ ప్రేమతో నడిపిస్తారు. మీ బలంతో మీరు వారిని మీ పరిశుద్ధాలయానికి నడిపిస్తారు.
14
దేశాలు విని వణుకుతాయి; ఫిలిష్తియా ప్రజలకు వేదన కలుగుతుంది.
15
ఎదోము పెద్దలు భయపడతారు, మోయాబు నాయకులకు వణుకు పుడుతుంది. కనాను ప్రజలు భయంతో నీరైపోతారు;
16
భయం దిగులు వారి మీద పడతాయి. యెహోవా, మీ ప్రజలు దాటి వెళ్లేవరకు, మీరు కొనిన మీ ప్రజలు దాటి వెళ్లేవరకు మీ బాహుబలము చేత వారు రాతిలా కదలకుండా ఉంటారు.
17
మీరు వారిని లోపలికి తెచ్చి మీ స్వాస్థ్యమైన పర్వతం మీద యెహోవా, మీరు నివసించడానికి నిర్మించుకున్న స్థలంలో, ప్రభువా, మీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో నాటుతారు.
18
“యెహోవా నిరంతరం పరిపాలిస్తారు.”
19
ఫరో గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు సముద్రంలోకి వచ్చినప్పుడు, యెహోవా వారి మీదికి సముద్రపు నీటిని రప్పించారు. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచారు.
Settings