Skip to content
ద్వితీయోపదేశకాండము 29:16-28

ద్వితీయోపదేశకాండము 29:16-28

16
మేము ఈజిప్టులో ఎలా జీవించామో, ఇక్కడి మార్గంలో దేశాల గుండా ఎలా వెళ్లామో మీకే తెలుసు.
17
వాటిలో మీరు వారి అసహ్యకరమైన చిత్రాలు చెక్క రాతి, వెండి బంగారు విగ్రహాలను చూశారు.
18
ఆ దేశాల దేవుళ్ళను సేవించడానికి వెళ్లి మన దేవుడైన యెహోవా నుండి తమ హృదయాన్ని మనస్సు ప్రక్కకు త్రిప్పుకున్న పురుషుడు గాని, స్త్రీ గాని, వంశం గాని గోత్రం గాని లేరనే విషయాన్ని నిర్ధారించుకోండి; అటువంటి చేదు విషాన్ని ఉత్పత్తి చేసే మూలం మీ మధ్యలో లేదనేది నిర్ధారించుకోండి.
19
అలాంటి వ్యక్తులు ఈ ప్రమాణం యొక్క మాటలు విన్నప్పుడు, వారు తమ మీదికి ఆశీర్వాదాన్ని ఆహ్వానించుకుంటూ, “నేను నా సొంత మార్గంలో వెళ్లాలని పట్టుదలతో ఉన్నప్పటికీ, నేను సమాధానం కలిగి ఉంటాను” అని అనుకుంటారు, వారు నీటితో తడపబడిన భూమిపైకి, అలాగే ఎండిన భూమిపైకి విపత్తును తెస్తారు.
20
యెహోవా వారిని క్షమించడానికి ఎన్నటికీ ఇష్టపడరు; ఆయన కోపం, రోషం వారిపై భగ్గుమంటాయి. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ వారి పైకి వస్తాయి, యెహోవా ఆకాశం క్రిందనుండి వారి పేర్లను తుడిచివేస్తారు.
21
ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడిక యొక్క అన్ని శాపాల ప్రకారం, కీడు కలుగజేయడానికి యెహోవా వారిని ఇశ్రాయేలు యొక్క అన్ని గోత్రాల నుండి వేరు చేస్తారు.
22
తర్వాతి తరాలలో మిమ్మల్ని అనుసరించే మీ పిల్లలు, సుదూర దేశాల నుండి వచ్చిన విదేశీయులు, దేశంపై పడిన ఆపదలను, వ్యాధులను వేటితోనైతే యెహోవా దాన్ని బాధించారో చూస్తారు.
23
దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది.
24
దేశాలన్నీ, “ఈ దేశానికి యెహోవా ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఈ భయంకరమైన, మండుతున్న కోపం?” అని అడుగుతాయి.
25
దానికి సమాధానం ఇలా ఉంటుంది: “ఈ ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవా ఒడంబడికను, ఆయన వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు ఆయన వారితో చేసుకున్న ఒడంబడికను విడిచిపెట్టారు.
26
వారు వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించారు, వారికి నమస్కరించారు, వారు వారికి తెలియని దేవుళ్ళు, ఆయన వారికి ఇవ్వని దేవుళ్ళు.
27
అందువల్ల ఆ దేశంపై యెహోవా కోపం భగ్గుమంది, అందుకే గ్రంథంలో వ్రాయబడి ఉన్న అన్ని శాపాలను ఆయన వారి పైకి తీసుకువచ్చారు.
28
యెహోవా భీకరమైన కోపంలో, గొప్ప క్రోధంలో వారి దేశంలో నుండి వారిని పెకిలించి, ఇప్పుడున్నట్లుగా, వారిని వేరే దేశంలోకి నెట్టివేశారు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options