2 దినవృత్తాంతములు 33:6-13
6
అతడు తన పిల్లలను బెన్ హిన్నోము లోయలో అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని, చేతబడిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ, ఆయనకు కోపం రేపాడు.
7
అతడు చెక్కించిన విగ్రహాన్ని ఆ ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.
8
నేను ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన చట్టాలు, శాసనాలు, నిబంధనలను గురించి నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, నేను మీ పూర్వికులకు నియమించిన దేశంలో నుండి ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.
9
కానీ మనష్షే యూదా వారిని, యెరూషలేము ప్రజలను తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.
10
యెహోవా మనష్షేతో, అతని ప్రజలతో మాట్లాడారు గాని వారు పెడచెవిని పెట్టారు.
11
అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు.
12
బాధలో అతడు తన పూర్వికుల దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకుని తన దేవుడైన యెహోవాను దయచూపమని ప్రాధేయపడ్డాడు.
13
అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతని విన్నపం ఆలకించి అతని ప్రార్థన అంగీకరించారు. అతడు యెరూషలేముకు అతని రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకున్నాడు.
Settings