Skip to content

కీర్తనలు 140

కపట శత్రువుల నుండి విడుదల కొరకు ప్రార్థన 1–5

1
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి; హింసించేవారి నుండి నన్ను కాపాడండి,
2
వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు రోజు యుద్ధము రేపుతారు.
3
వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా
4
యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి; దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి, నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు.
5
అహంకారులు చాటుగా వల ఉంచారు; వారు వల దాడులు పరచారు, నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా

విశ్వాస ప్రకటన మరియు కాపుదల కొరకు వేడుకోలు 6–8

6
నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను. యెహోవా, దయతో మొరను ఆలకించండి.
7
ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా, యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు.
8
యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి; వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి. సెలా

దైవిక తీర్పు కొరకు ప్రార్థన 9–11

9
నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు; వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి.
10
మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి; వారు అగ్నిలో పడవేయబడాలి, తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి.
11
దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక; విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి.

దేవుని న్యాయంపై విశ్వాసం 12–13

12
యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని, అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు.
13
నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు, యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.