కీర్తనలు 121
యాత్రికుడు పైకి చూచుట 1–2
1
యాత్రకీర్తన. కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?
2
ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది.
కునుకని నిద్రపోని కాపరి 3–6
3
ఆయన నీ పాదాన్ని తొట్రిల్లనివ్వరు, నిన్ను కాపాడేవాడు కునుకడు.
4
నిజానికి, ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కునుకడు న్రిదపోడు.
5
యెహోవా నిన్ను కాపాడతారు, యెహోవా మీ కుడి వైపున మీకు నీడగా ఉంటారు.
6
పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు.
నిత్యమైన మరియు సంపూర్ణమైన కాపుదల 7–8
7
సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.
8
ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో యెహోవా నిన్ను కాపాడును.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Study note