కంటెంట్‌కు వెళ్లండి

2 దినవృత్తాంతములు17

యెహోషాపాతు తన పాలనను స్థిరపరచుట

1
ఆసా స్థానంలో అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తనను తాను బలపరచుకున్నాడు.
2
కోటగోడలు గల యూదా పట్టణాలన్నిటిలో అతడు సైన్యాలను ఉంచాడు. యూదాలోనూ, తన తండ్రి ఆసా పట్టుకున్న ఎఫ్రాయిం ప్రాంత పట్టణాల్లోనూ రక్షక దళాలను ఏర్పాటు చేశాడు.

యెహోషాపాతు భక్తి మరియు ఐశ్వర్యము

3
యెహోషాపాతు తన పితరుడైన దావీదు ఆరంభ దినాల్లో అనుసరించిన విధానాలను అనుసరించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు బయలును అనుసరించలేదు.
4
అతడు ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు చేయక తన తండ్రి యొక్క దేవున్ని వెదికి, ఆయన ఆజ్ఞలు అనుసరించాడు.
5
కాబట్టి యెహోవా అతని ఆధీనంలో రాజ్యాన్ని సుస్థిరం చేశారు. యూదా ప్రజలంతా యెహోషాపాతుకు పన్ను చెల్లిస్తూ ఉండేవారు కాబట్టి అతనికి ఎంతో గౌరవం, ఐశ్వర్యం చేకూరాయి.
6
యెహోవా మార్గాల్లో నడవాలని అతడు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. అతడు క్షేత్రాలను అషేరా స్తంభాలను యూదా దేశంలో లేకుండా తొలగించాడు.

యూదాలో బోధనా పరిచర్య

7
తాను పరిపాలిస్తున్న మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్-హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే నాయకులను పంపాడు.
8
వారితో పాటు షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబీయా, టోబ్-అదోనియా అనే లేవీయులను యాజకులైన ఎలీషామా, యెహోరాము అనే వారిని పంపాడు.
9
వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చేతపట్టుకుని యూదా అంతటా బోధించారు. వారు యూదాపట్టణాలన్నిటికి సంచారం చేస్తూ ప్రజలకు బోధించారు.

విదేశీ జనములు యెహోషాపాతును గౌరవించుట

10
యూదా చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి అవి యెహోషాపాతుపై యుద్ధం చేయలేదు.
11
ఫిలిష్తీయులలో కొంతమంది యెహోషాపాతుకు కానుకలు, పన్నుగా వెండిని తెచ్చేవారు. అరబీయులు అతనికి 7,700 పొట్టేళ్లు, 7,700 మేకపోతులు తెచ్చేవారు.

సైనిక బలము మరియు ఏర్పాటు

12
యెహోషాపాతు అధికంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అతడు యూదాలో కోటలు, సామాగ్రి నిల్వజేసే గిడ్డంగుల పట్టణాలు కట్టించాడు.
13
యూదా పట్టణాల్లో అతనికి చాలా సంపద చేకూరింది. అతని దగ్గర యెరూషలేములో అనుభవం కలిగిన పోరాట వీరులున్నారు.
14
వారి పూర్వికుల వంశాల ప్రకారం వారి సంఖ్య ఇలా ఉంది: యూదా గోత్రాల్లో వేయిమందికి అధిపతులుగా ఉన్నవారికి అద్నా అనేవాడు సేనాధిపతి: అతనితో 3,00,000 మంది యుద్ధవీరులున్నారు,
15
తర్వాత సేనాధిపతియైన యెహోహనాను, అతనితో 2,80,000 మంది ఉన్నారు,
16
తర్వాత, జిఖ్రీ కుమారుడు అమస్యా. అతడు యెహోవాకు హృదయపూర్వకంగా సమర్పించుకున్నవాడు. అతనితో 2,00,000 మంది యుద్ధవీరులున్నారు.
17
బెన్యామీను గోత్రంలో: ఎల్యాదా అనే యుద్ధవీరుడు ఉండేవాడు. అతనితో విల్లు, డాలు పట్టుకునేవారు 2,00,000 మంది ఉన్నారు,
18
తర్వాత, యెహోజాబాదు, అతనితో 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.
19
వీరంతా రాజుకు కొలువు చేసినవారు. వీరు కాక రాజు యూదా అంతటా కోటగోడలు గల పట్టణాల్లో కొంతమందిని ఉంచాడు.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options