Skip to content
లేవీయకాండము 6:8-23

లేవీయకాండము 6:8-23

8
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
9
“అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘ఇది దహనబలికి సంబంధించిన నియమం: దహనబలి రాత్రి నుండి ఉదయం వరకు బలిపీఠం పొయ్యిపై ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి.
10
యాజకుడు తన నారబట్టలు నారలోదుస్తులు వేసుకుని, బలిపీఠం మీద అగ్నికి కాలిపోయిన దహనబలి అర్పణ బూడిదను తీసి బలిపీఠం ప్రక్కన ఉంచాలి.
11
తర్వాత అతడు ఈ బట్టలు విడిచి వేరే దుస్తులు ధరించి శిబిరం బయట ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న స్థలానికి ఆ బూడిద తీసుకెళ్లాలి.
12
బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు పేర్చి, మంట మీద దహనబలి ఉంచి సమాధానబలుల క్రొవ్వును దహించాలి.
13
బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూ ఉండాలి; అది ఆరిపోకూడదు.
14
“ ‘ఇవి భోజనార్పణకు సంబంధించిన నియమాలు: అహరోను కుమారులు యెహోవా ఎదుట బలిపీఠం ఎదురుగా దానిని అర్పించాలి.
15
యాజకుడు భోజనార్పణలో నుండి పిడికెడు నాణ్యమైన పిండిని కొంచెం ఒలీవ నూనెను సాంబ్రాణి మొత్తాన్ని తీసుకుని వాటిని జ్ఞాపక భాగంగా బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.
16
అందులో మిగిలింది అహరోను అతని కుమారులు తినాలి, అయితే పరిశుద్ధాలయ ప్రాంతంలో పులియకుండా దానిని తినాలి; సమావేశ గుడారం యొక్క ఆవరణంలో వారు దానిని తినాలి.
17
దానిని పులిసిన దానితో కలిపి కాల్చకూడదు; నాకు సమర్పించిన హోమబలులలో నేను దానిని వారి వాటాగా ఇచ్చాను. పాపపరిహారబలిలా అపరాధపరిహారబలిలా, ఇది అతిపరిశుద్ధము.
18
అహరోను వంశస్థుడు ఎవరైనా దానిని తినవచ్చు. అన్ని తరాలకు ఇది యెహోవాకు సమర్పించబడే హోమబలులలో అతని శాశ్వత వాటా. వాటిని ఏది తాకినా అది పవిత్రమవుతుంది.’ ”
19
యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు,
20
“అహరోను అభిషేకించబడిన రోజున అతడు, అతని కుమారులు యెహోవా దగ్గరకు తీసుకురావలసిన అర్పణ ఇది: భోజనార్పణగా ఒక ఓమెరు నాణ్యమైన పిండి ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి.
21
దానిని పెనం మీద నూనెతో కాల్చాలి; బాగా కాల్చి ముక్కలుగా చేసిన భోజనార్పణను యెహోవాకు ఇష్టమైన సువాసనగా సమర్పించాలి.
22
ప్రధాన యాజకునిగా అతని తర్వాత వచ్చే కుమారుడు దానిని సిద్ధం చేయాలి. ఇది యెహోవాకు శాశ్వత వాటా, ఇది పూర్తిగా దహించబడాలి.
23
యాజకుడు అర్పించే ప్రతి భోజనార్పణను పూర్తిగా దహించబడాలి; దానిని తినకూడదు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options