న్యాయాధిపతులు 6:25-32
25
ఆ రాత్రే యెహోవా అతనితో ఇలా అన్నారు, “నీ తండ్రి మందలో నుండి ఏడు సంవత్సరాల వయస్సున్న రెండవ కోడెను తీసుకో. నీ తండ్రి కట్టిన బయలు దేవత బలిపీఠాన్ని పడగొట్టు, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని విరగ్గొట్టు.
26
తర్వాత ఈ దుర్గం పైన సరియైన విధంగా నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టు. నీవు విరగ్గొట్టిన అషేరా స్తంభం కర్రను వాడుతూ ఆ రెండవ కోడెను దహనబలిగా అర్పించు.”
27
కాబట్టి గిద్యోను తన సేవకులలో పదిమందిని తీసుకెళ్లి యెహోవా తనతో చెప్పింది చేశాడు. కాని తన కుటుంబానికి, నగర ప్రజలకు భయపడి పగటి వేళలో కాకుండా రాత్రి వేళలో చేశాడు.
28
ఉదయం ఆ నగర ప్రజలు లేచినప్పుడు పడిపోయిన బయలు బలిపీఠం, దాని ప్రక్కన విరిగిపోయిన అషేరా స్తంభం, క్రొత్తగా కట్టబడిన బలిపీఠం మీద రెండవ కోడె అర్పించబడి ఉండడం చూశారు.
29
వారు, “ఎవరు ఇది చేశారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వారు జాగ్రతగా విచారణ చేసినప్పుడు, “యోవాషు కుమారుడైన గిద్యోను దానిని చేశాడు” అని వారికి తెలిసింది.
30
నగర ప్రజలు యోవాషుతో, “నీ కుమారుడు బయలు బలిపీఠాన్ని పడగొట్టి, దాని ప్రక్కనున్న అషేరా స్తంభాన్ని పడద్రోసాడు కాబట్టి అతడు చావాలి. అతన్ని బయటకు తీసుకురా” అన్నారు.
31
యోవాషు తన చుట్టూ చేరి గొడవ చేస్తున్న గుంపుతో, “మీరు బయలు పక్షాన ఉన్నారా? అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? వాని పక్షాన వాదించేవారు తెల్లవారక ముందే చావాలి! ఒకవేళ బయలు నిజంగా దేవుడైతే, ఎవరైనా తన బలిపీఠం పడగొట్టినప్పుడు తాను పోరాడతాడు కదా” అని చెప్పాడు.
32
గిద్యోను బయలు బలిపీఠాన్ని పడగొట్టాడు కాబట్టి ఆ రోజున అతనికి యెరుబ్-బయలు అని పేరు పెట్టి, “బయలును అతనితో వాదించుకోని” అని అన్నారు.
Settings