యిర్మీయా 36:24-32
24
ఈ మాటలన్నీ విన్న రాజు గాని అతని సహాయకులెవ్వరు గాని భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు.
25
ఆ గ్రంథపుచుట్టను కాల్చవద్దు అంటూ ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును అభ్యర్థించారు, కాని రాజు వారి అభ్యర్థనను వినిపించుకోలేదు.
26
పైగా రాజు, లేఖికుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను బంధించమని రాజకుమారుల్లో ఒకడైన యెరహ్మెయేలు, అజ్రీయేలు కుమారుడైన శెరాయా, అబ్దీయేలు కుమారుడైన షెలెమ్యాలను ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా వారిని దాచిపెట్టారు.
27
యిర్మీయా చెప్తూ ఉండగా బారూకు వ్రాసిన ఆ గ్రంథపుచుట్టను రాజు కాల్చివేసినప్పుడు, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది:
28
“మరో గ్రంథపుచుట్టను తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చివేసిన మొదటి గ్రంథపుచుట్టలో ఉండిన మాటలన్నీ దానిపై వ్రాయి.
29
అలాగే యూదా రాజైన యెహోయాకీముతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ఆ గ్రంథపుచుట్టను కాల్చివేసి, “బబులోను రాజు ఖచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తాడని దాని నుండి మనుష్యులను, జంతువులను తుడిచివేస్తాడని నీవు దానిపై ఎందుకు వ్రాశావు?” అని అన్నావు.
30
కాబట్టి యూదా రాజైన యెహోయాకీమును గురించిన యెహోవా వాక్కు ఇదే: దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీకు ఎవరూ ఉండరు, అతని శవం పగలు ఎండలో రాత్రి మంచులో పడి ఉంటుంది.
31
నేను అతన్ని, అతని పిల్లలను అతని సేవకులను వారి దుర్మార్గాన్ని బట్టి శిక్షిస్తాను; నేను వారి మీదికి, యెరూషలేములో నివసించేవారి మీదికి, యూదా ప్రజలమీదికి నేను వారికి వ్యతిరేకంగా ప్రకటించిన ప్రతీ విపత్తును రప్పిస్తాను, ఎందుకంటే వారు నా మాట వినలేదు.’ ”
32
కాబట్టి యిర్మీయా మరో గ్రంథపుచుట్టను తీసుకుని నేరియా కుమారుడైన బారూకు అనే లేఖికునికి ఇచ్చి, యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపుచుట్టలోని మాటలన్నిటిని యిర్మీయా చెప్తూ ఉండగా, బారూకు దానిపై వ్రాశాడు. ఆ మాటలతో పాటు అలాంటి అనేక మాటలను వ్రాశాడు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.