ఆదికాండము 27:30-38
30
ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు.
31
అతడు కూడా రుచిగల భోజనం వండుకొని తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడతడు, “నా తండ్రి, నన్ను దీవించడానికి నేను వేటాడి తెచ్చిన మాంసంతో సిద్ధం చేసిన భోజనం తిను” అని అతనితో అన్నాడు.
32
అప్పుడు తన తండ్రి ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు. అందుకతడు, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు.
33
ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!”
34
తన తండ్రి మాట విన్న వెంటనే ఏశావు దుఃఖంతో బిగ్గరగా ఏడ్చి, “నన్ను కూడా దీవించు, నా తండ్రి!” అని అన్నాడు.
35
అయితే అతడు, “నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు” అన్నాడు.
36
ఏశావు, “అతనికి యాకోబు అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?” అని అడిగాడు.
37
ఇస్సాకు జవాబిస్తూ, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడు.
38
అందుకు ఏశావు తన తండ్రితో, “నా తండ్రి, ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు!” అని అంటూ గట్టిగా ఏడ్చాడు.
Settings