Skip to content
ద్వితీయోపదేశకాండము 28:8-32

ద్వితీయోపదేశకాండము 28:8-32

8
మీ కొట్ల మీదకు మీ ప్రయత్నాలన్నిటి మీదకు యెహోవా దీవెనలు పంపుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
9
మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు.
10
అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు.
11
యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు.
12
కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు.
13
యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు.
14
ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, వారిని సేవిస్తూ, ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞల నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు.
15
అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపక, నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా పాటించకపోతే, ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయి.
16
మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు.
17
మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.
18
మీ గర్భఫలం శపించబడుతుంది, మీ భూమి పంటలు, మీ పశువుల దూడలు, మీ మందల గొర్రెపిల్లలు శపించబడతాయి.
19
మీరు లోపలికి వచ్చినప్పుడు శపించబడతారు, బయటకు వెళ్లినప్పుడు శపించబడతారు.
20
మీరు ఆయనను విడిచిపెట్టి చేసిన చెడు కారణంగా, అకస్మాత్తుగా నాశనమయ్యే వరకు, యెహోవా మీరు చేయి వేసిన ప్రతి దాని మీదికి శాపాలు, నిరాశను, నిరుత్సాహాన్ని పంపుతారు.
21
మీరు స్వాధీనపరచుకోడానికి ప్రవేశిస్తున్న దేశంలో ఉండకుండ మిమ్మల్ని నాశనం చేసే వరకు యెహోవా మిమ్మల్ని రోగాలతో తెగులుతో బాధిస్తారు.
22
యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో, ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది.
23
మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి.
24
యెహోవా మీ దేశపు వర్షాన్ని దుమ్ము, పొడిగా మారుస్తారు; మీరు నాశనం అయ్యేవరకు అది ఆకాశాల నుండి దిగి వస్తుంది.
25
మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది.
26
మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు.
27
యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు.
28
యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో, గ్రుడ్డితనంతో, మానసిక ఆందోళనతో బాధిస్తారు.
29
మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు.
30
మీకు ఒక స్త్రీతో పెళ్ళి నిశ్చయమవుతుంది, కానీ మరొకరు ఆమెను తీసుకెళ్లి పాడుచేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటారు, కానీ మీరు అందులో నివసించరు. మీరు ద్రాక్షతోటను నాటుతారు, కానీ మీరు దాని ఫలాలను తినరు.
31
మీరు చూస్తూ ఉండగానే మీ ఎద్దు వధించబడుతుంది, కానీ మీరు దాంట్లో నుండి ఏమి తినరు. మీ గాడిద బలవంతంగా తీసుకెళ్తారు, మళ్ళీ మీకివ్వరు. మీ గొర్రెలు మేకలు శత్రువుల వశమవుతాయి, వాటిని ఎవ్వరూ రక్షించరు.
32
మీ కుమారులు కుమార్తెలు వేరొక దేశానికి ఇవ్వబడతారు, దినదినం వారి కోసం ఎదురుచూసి మీ కళ్లు అలసిపోతాయి, చేయి ఎత్తడానికి కూడా శక్తి ఉండదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options