Skip to content
1 దినవృత్తాంతములు 29:1-9

1 దినవృత్తాంతములు 29:1-9

1
అప్పుడు రాజైన దావీదు సమావేశంలో ఉన్నవారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా చిన్నవాడు, అనుభవం లేనివాడు. మందిరం నిర్మించేది మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవా కోసం, కాబట్టి పని చాలా గొప్పది.
2
నాకున్న శక్తికొలది నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, చెక్క పనికి చెక్కను, పెద్ద మొత్తంలో గోమేధికపురాళ్లను, వైడూర్యాలను, రకరకాల రంగుల రాళ్లను, అన్ని రకాల జాతి మేలిమి రాళ్లను, పాలరాతిని సమృద్ధిగా సమకూర్చి పెట్టాను.
3
పరిశుద్ధ మందిరం కోసం నేను సమకూర్చినవన్నీ కాకుండా, ఇప్పుడు నా దేవుని మందిరం పట్ల నాకున్న నిబద్ధతను చూపించడానికి నా సొంత ఖజానాలో ఉన్న బంగారాన్ని, వెండిని, నా దేవుని మందిరానికి ఇస్తున్నవి:
4
భవనాల గోడలకు పూత వేయడానికి, బంగారపు పనికి, వెండి పనికి, పనివారు చేసే ప్రతి పనికి మూడువేల తలాంతుల ఓఫీరు బంగారం, ఏడువేల తలాంతుల శుద్ధి చేసిన వెండి. ఇప్పుడు, యెహోవాకు మనస్పూర్తిగా సమర్పించుకునే వారు మీలో ఎవరైనా ఉన్నారా?”
6
అప్పుడు కుటుంబ నాయకులు, ఇశ్రాయేలు గోత్రాల అధికారులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పనుల మీద నియమించబడిన అధికారులు అందరు ఇష్టపూర్వకంగా సమర్పించారు.
7
వారు దేవుని మందిరం పనికి అయిదువేల తలాంతుల బంగారాన్ని, పదివేల డారిక్కుల బంగారాన్ని, పదివేల తలాంతుల వెండిని, పద్దెనిమిది వేల తలాంతుల ఇత్తడిని, లక్ష తలాంతుల ఇనుమును ఇచ్చారు.
8
ప్రశస్తమైన రాళ్లు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర ఖజానాకు అధికారిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.
9
తమ నాయకులు హృదయమంతటితో స్వేచ్ఛగా యెహోవాకు సమర్పించడం చూసి ప్రజలు వారిని బట్టి సంతోషించారు. రాజైన దావీదు కూడా చాలా సంతోషించాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options